UNO: ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ కు అమెరికా రాంరాం!

  • కౌన్సిల్ నుంచి తప్పుకున్న యూఎస్ఏ
  • ఇజ్రాయిల్ విషయంలో ద్వంద్వ వైఖరి
  • ఐరాస వైఖరిపై నిక్కీ హేలీ విమర్శలు

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ నుంచి తప్పుకుంటున్నట్టు అమెరికా స్పష్టం చేసింది. ఇజ్రాయిల్ విషయంలో కౌన్సిల్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని విమర్శించిన ట్రంప్ ప్రభుత్వం, మానవ హక్కులను కౌన్సిల్ పరిరక్షించలేక పోయిందని నిప్పులు చెరిగింది. కౌన్సిల్ లో తాము సూచించిన విధంగా మార్పులు చేర్పులు చేయాలని యూఎన్ అంబాసిడర్ నిక్కీ హేలీ గతంలో డిమాండ్ చేయగా, అందుకు ఐరాస నిరాకరించిన సంగతి తెలిసిందే.

 ఇక, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి తప్పుకున్న తరువాత నిక్కీ హేలీ స్పందిస్తూ, "మానవ హక్కులను కాలరాస్తున్నవారికి ఈ కౌన్సిల్ రక్షణగా నిలుస్తోంది. కౌన్సిల్ మొత్తం రాజకీయాలతో నిండిపోయింది. సామూహిక హత్యలు, హింసాకాండ అత్యధికంగా జరిగే కాంగోను కౌన్సిల్ లోకి ఎందుకు తీసుకున్నారు? వెనిజులా, ఇరాన్ లో మానవ హక్కులను కాలరాస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదు?" అని వ్యాఖ్యానించారు. మైక్ పాంపియోతో కలసి మీడియాతో మాట్లాడిన ఆమె, హక్కులను కాపాడలేకపోతున్న కౌన్సిల్ లో తాము కొనసాగాల్సిన అవసరం లేదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

More Telugu News