Ganta Srinivasa Rao: సర్వేల పేరుతో అప్రతిష్ఠపాలు చేయడంపై మంత్రి గంటా మనస్తాపం.. కేబినెట్ భేటీకి గైర్హాజరు.. పార్టీలో చర్చనీయాంశం!

  • కేబినెట్ సమావేశానికి మంత్రి డుమ్మా
  • తనపై వ్యతిరేక ప్రచారం జరుగుతోందని మనస్తాపం
  • అధిష్ఠానం పట్టించుకోవడం లేదని కినుక

గత రాత్రి జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానికి మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన కోసం మంత్రులు ఫోన్ ద్వారా సంప్రదించినా అందుబాటులోకి రాలేదు. సర్వే పేరుతో తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నందున ఆయన మనస్తాపం చెందారని సమాచారం. సొంత నియోజకవర్గంలో తనపై వ్యతిరేకత ఉందనే ప్రచారం చేస్తున్నారని, దీనికి పార్టీయే కారణమని ఆయన భావిస్తున్నారు. పార్టీలో గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలను అధిష్ఠానం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని మంత్రి పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.  

విశాఖలో భూముల కుంభకోణానికి పాల్పడినట్టు, ప్రభుత్వ భూములను తనఖా పెట్టి బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నట్టు వస్తున్న ఆరోపణల వెనక పార్టీకి చెందిన కొందరి హస్తం ఉందని గంటా నమ్ముతున్నారు. హైకోర్టులో పిల్ వేయడంలోనూ వారి పాత్ర ఉందని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా తనపై ఆరోపణలు ఆగడం లేదనే మనస్తాపంలో ఉన్నారు.

గంటాపై వచ్చిన భూముల కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు చేసిన ‘సిట్’ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆ కుంభకోణంలో తన పాత్ర లేదని సిట్ తేల్చిందని, అయితే, ఆ నివేదికను ప్రభుత్వం బయటపెట్టకుండా తనను ఇబ్బంది పెడుతోందని గంటా భావిస్తున్నారు. ఈ కారణాల వల్లే ఆయన భేటీకి హాజరు కాలేదని సమాచారం.

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. అలాగే, భీమిలిలో ఏర్పాటు చేసిన మరో రెండు కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు. తన నియోజకవర్గంలో జరిగే ఈ కార్యక్రమాలకు హాజరుకావడంపై మంత్రి గంటా ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం.

More Telugu News