Telangana: నాలుగో విడత హరితహారంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండాచూడాలి: తెలంగాణ సీఎస్ జోషి

  • జులై రెండో వారంలో నాల్గో విడత హరితహారం 
  • మెరుగైన ఫలితాల కోసం ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలి
  • మొక్కలు, నాటే ప్రాంతాల ఎంపిక, పిట్స్ తవ్వకం పూర్తి చేయాలి

తెలంగాణకు హరితహారం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతా పథకాల్లో ఒకటని, ఏమాత్రం పొరపాట్లు జరగకుండా నాలుగో విడత హరితహారం కోసం సన్నద్ధం కావాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలకు చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి పిలుపు నిచ్చారు. ఈ ఏడాది హరితహారంలో 39 కోట్ల మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా నాటాలని నిర్ణయించామని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొక్కలు నాటే ప్రాంతాల గుర్తింపులో కొన్ని జిల్లాలు వెనుకపడ్డాయని తక్షణం ఆ ప్రక్రియను పూర్తి చేయాలని, ప్రణాళిక ప్రకారం ప్రాంతాల గుర్తింపు, ముందుస్తుగా పిట్స్ తవ్వకం, రక్షణా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈసారి హరితహారంలో స్కూలు పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామని, వారినే ప్రతీ ఇంటి హరితహారం వారధిగా గుర్తించాలని సూచించారు. అలాగే, ఈత మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చే రైతులకు హార్టీకల్చర్ డిపార్ట్ మెంట్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని కల్పించాలని, కోతుల బెడద నివారణ కోసం ప్రతీ జిల్లా అటవీ ప్రాంతాల్లో 5 నుంచి 6 లక్షల పండ్ల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హరితహారం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 25, 28 తేదీల్లో శిక్షణా కార్యక్రమం ఉంటుందని, సంబంధింత శాఖల నుంచి డీపీఓ, డీఎప్ఓ, మున్సిపల్, డీఆర్డీడీవో, వ్యవసాయ, హార్టీ కల్చర్ అధికారులు పాల్గొంటారని, వీరే ఆ తర్వాత జిల్లా, మండల స్థాయిలో శిక్షణ ఇస్తారని వెల్లడించారు. గత హరితహారంలో నాటిన మొక్కలు బతికిన శాత తేల్చేందుకు రాండమ్ సర్వే నిర్వహించనున్నామని, థర్డ్ పార్టీ టీమ్ లను ఎంపిక చేసి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని, ఆయా శాఖలకు కేటాయించిన పార్కుల పనులు జులై 15 నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఈ లోగా ప్రణాళికల తయారీ, టెండర్ల పనులు పూర్తి చేయాలని జోషి ఆదేశించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎన్ హెచ్ -161 సంగారెడ్డి, నాందేడ్, అకొలాకు సంబంధించి సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించి భూసేకరణను వేగవంతం చేయాలని అన్నారు.

ఎన్ హెచ్-163 మన్నెగూడకు సంబంధించి రంగారెడ్డి, ఎన్ హెచ్-167జడ్చర్ల కు సంబంధించి మహబూబునగర్, ఎన్ హెచ్-363 మంచిర్యాల, చంద్రాపూర్ కు సంబంధించి మంచిర్యాల, ఆసిఫాబాద్, ఎన్ హెచ్-563 కు సంబంధించి జగిత్యాల, కరీంనగర్, వరంగల్, ఎన్ హెచ్-365 కు సంబంధించి  సూర్యాపేట జిల్లా కలెక్టర్లు భూసేకరణను పూర్తి చేయాలని, జాతీయ రహదారులు సకాలంలో పూర్తి కావడంలో భూసేకరణ కీలకమని, కాంట్రాక్టర్లకు నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. తదుపరి సమావేశంలోగా భూసేకరణ అంశాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.

కాగా, శిక్షణ వివరాలు త్వరలోనే జిల్లాల వారీగా పంపుతామని, అదే విధంగా హరితహారంలో భాగంగా నాటేందుకు సిద్ధంగా ఉన్న మొక్కలు, రకాల వివరాలతో జిల్లాల వారీ డైరెక్టరీలను సిద్ధం చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా తెలిపారు. కొత్త పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం నర్సరీల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సిబ్బంది అకింత భావంతో పని చేస్తేనే హరితహారం విజయవంతం అవుతుందని పీసీసీఎఫ్ పీ.కే.ఝా అన్నారు. మూడేళ్ల ఫలితాలు ఇప్పుడు పెరిగిన పచ్చదనం రూపంలో మన కళ్ల ముందు కనిపిస్తున్నాయని, నాలుగో విడతలో ప్రజా భాగస్వామ్యం మరింత పెరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. గత ఏడాది వరకు కోటీ డెబ్భై లక్షల ఈత మొక్కలు నాటామని, ఈ ఏడాది రెండు కోట్ల ఈత మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎక్సయిజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు.

More Telugu News