icc: 6వ స్థానానికి పడిపోయిన ఆస్ట్రేలియా.. రెండో స్థానంలో టీమిండియా

  • ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ఆరో స్థానానికి పడిపోయిన ఆసీస్
  • 1984 జనవరి తర్వాత ఇదే తొలిసారి
  • తొలి స్థానంలో ఇంగ్లండ్, రెండో స్థానంలో టీమిండియా

ప్రపంచ క్రికెట్ ను ఎన్నో ఏళ్ల పాటు శాసించిన ఆస్ట్రేలియా ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో ఆరో స్థానానికి దిగజారింది. తద్వారా గత  34 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంత దారుణ స్థానానికి పడిపోయింది.

ఇంగ్లండ్ తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లను ఆసీస్ ఓడిపోయింది. మిగిలిన మూడు మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ అయినా గెలిస్తే, ఐదో స్థానానికి చేరుకుంటుంది. cricket.com.au కథనం ప్రకారం 1984 జనవరిలో ఆస్ట్రేలియా జట్టు ఆరో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. మరోవైపు టీమిండియా వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉంది.

రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా జట్టు వన్డేల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ ను 5-0 తేడాతో కోల్పోయింది. అనంతరం జరిగిన 15 వన్డేల్లో ఏకంగా 13 మ్యాచ్ లలో ఓటమిని మూటగట్టుకుంది. ఈ సందర్భంగా న్యూజిలాండ్, ఇండియా, ఇంగ్లండ్ లపై సిరీస్ లను కోల్పోయింది.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్ తొలి స్థానంలో ఉండగా ఇండియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్ లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా ఆరో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వే, ఐర్లండ్, స్కాట్లండ్, యూఏఈ ఉన్నాయి.

More Telugu News