Supreme Court: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించొద్దన్న కేంద్ర మంత్రి

  • మా ముందుకు పేరు వచ్చినప్పుడు చర్చిస్తాం
  • ఈ ఏడాది అక్టోబర్ 2తో ప్రస్తుత చీఫ్ జస్టిస్ మిశ్రా పదవీ కాలం పూర్తి
  • తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించొద్దని కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. గత నాలుగేళ్ల కాలంలో న్యాయశాఖ సాధించిన లక్ష్యాలను వివరించడానికి మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుత చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అక్టోబర్ 2న పదవీ విరమణ చేస్తుండగా, సంప్రదాయాలను పాటిస్తూ, తదుపరి చీఫ్ జస్టిస్ గా రంజన్ గొగోయ్ ను నియమిస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. దీంతో తమ ఉద్దేశ్యాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని మంత్రి అన్నారు.

‘‘ఈ ప్రశ్న ఊహాజనితం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నియామకంలో సంప్రదాయం స్పష్టంగా ఉంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తే తన తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిని తన పోస్ట్ కు సిఫారసు చేస్తారు. ఆ పేరు మా ముందుకు వచ్చినప్పుడు దానిపై చర్చిస్తాం’’ అని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

ఈ ఏడాది జనవరిలో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహార శైలితో విభేదిస్తూ మీడియా ముందుకు వచ్చిన నలుగురు సీనియర్ న్యాయమూర్తుల్లో జస్టిస్ రంజన్ గొగోయ్ కూడా ఉండడం గమనార్హం. చీఫ్ జస్టిస్ పదవీ విరమణకు కొన్ని రోజుల ముందు తదుపరి ఆ పదవికి అర్హత కలిగిన వారిని సిఫారసు చేయాలని కోరుతూ న్యాయ శాఖ సంప్రదిస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ పదవిని చేపట్టే విషయంలో యోగత్య లేదా అర్హతపై సందేహాలుంటే అప్పుడు ఇతర న్యాయమూర్తులతో సంప్రదింపుల అనంతరం నియామకం చేపట్టాలని నిబంధనల ప్రక్రియ స్పష్టం చేస్తోంది. 

More Telugu News