Sivasena: శివసేనకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి.. కేసీఆర్ సపోర్ట్ కోరుతున్న బీజేపీ అధినాయకత్వం!

  • శివసేనకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చే ఆలోచనలో బీజేపీ
  • రాజ్యసభలో పూర్తి మెజారిటీ లేక టీఆర్ఎస్ సాయం కోరుతున్న అగ్రనేతలు
  • ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోని కేసీఆర్

త్వరలో జరిగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ మద్దతును బీజేపీ అధినాయకత్వం కోరుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీకి దూరమవుతున్న శివసేనను తిరిగి దగ్గరకు చేర్చుకునే దిశగా పావులు కదుపుతున్న బీజేపీ, ఆ పార్టీ ఎంపీకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో శివసేన అభ్యర్థికి మద్దతు పలకాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ను బీజేపీ నేతలు అభ్యర్థిస్తున్నట్టు సమాచారం.

ఈ నెలాఖరుకు డిప్యూటీ చైర్మన్ కురియన్ పదవీ కాలం ముగియనుండగా, ఆయన స్థానంలో కొత్త అభ్యర్థిగా ఎవరిని నిలపాలన్న విషయమై గత కొంత కాలంగా సమాలోచనలు చేస్తున్న బీజేపీ, చివరకు మిత్రపక్షమైన శివసేనకు ఆ పదవిని ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ విషయమై ఇప్పటికే రెండు పార్టీల మధ్య చర్చలు సాగాయని సమాచారం.

ఇక రాజ్యసభలో పూర్తి ఆధిపత్యం లేని బీజేపీ, డిప్యూటీ చైర్మన్ పదవి కోసం గతంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమకు మద్దతిచ్చిన పార్టీల సాయాన్ని కోరుతోంది. అందులో భాగంగానే తెరాస సపోర్టును బీజేపీ అగ్రనాయకత్వం ఆశిస్తున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం శివసేనకు ముగ్గురు ఎంపీలున్నారు. రాజ్ కుమార్ దూత్, అనిల్ దేశాయ్, సంజయ్ రౌత్ లు శివసేన తరఫున ఎంపీలుగా ఉండగా, వీరిలో ఒకరికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చాన్స్ రానుంది.

ఇక కేసీఆర్ ఇటీవలి ఢిల్లీ పర్యటనలో బీజేపీ కీలక నేతలు కేసీఆర్ తో ఈ విషయమై మాట్లాడారని కూడా సమాచారం. ప్రస్తుతం రాజ్యసభలో 241 మంది సభ్యులుండగా, ఎన్డీయేకు 108 మంది సభ్యులే ఉన్నారు. బీజేపీ తన అభ్యర్థిని గెలిపించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 121కి 13 మంది తక్కువ. ఇక టీఆర్ఎస్ పార్టీకి ఆరుగురు ఎంపీలుండటంతో వారు ఇటొస్తే గెలుపు సులువవుతుందని నరేంద్ర మోదీ, అమిత్ షా తదితరులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ విషయంలో తెరాస ఏం నిర్ణయం తీసుకుంటుందన్న విషయం తెలియాల్సివుంది.

More Telugu News