Chandrababu: నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు వైఖరిని తప్పుబట్టిన జీవీఎల్

  • గత రెండు నెలలుగా కేంద్ర ఆర్థిక శాఖతో సంప్రదింపులే చేయలేదు
  • పార్టీ ప్రచారానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారు
  • రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని కూడా పార్టీ ప్రచారానికే వాడుకుంటున్నారు

ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎండగట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బాబు వ్యాఖ్యలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తప్పుబట్టారు. చంద్రబాబు మాటలకు, చేతలకు ఏమాత్రం సంబంధం ఉండటం లేదని ఆయన మండిపడ్డారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఎన్నో అంశాలను లేవనెత్తిన చంద్రబాబు... గత రెండు నెలల కాలంలో కేంద్ర ఆర్థిక శాఖకు ఒక్క లేఖ అయినా రాశారా? ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడారా? అని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీకి అధినేతగానే చంద్రబాబు వ్యవహరిస్తున్నారని... ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేయడం లేదని జీవీఎల్ దుయ్యబట్టారు. పోరాటం, ఆరాటం అనే పేర్లతో ప్రచారం చేసుకోవడమే చంద్రబాబుకు సరిపోతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన పార్టీ ప్రచారం చేసుకుంటుంటే... కేంద్ర ప్రభుత్వం తనంతట తానే నిధులు పంపిస్తుందా? అని ప్రశ్నించారు. కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా అధికార యత్రాంగం ఒక పద్ధతిలో పని చేస్తుందని... దీన్ని విస్మరించి, కేవలం పార్టీ ప్రచారం మాత్రమే చేసుకుంటుంటే పనులు జరగవని అన్నారు. రాష్ట్ర మంత్రులు, అధికార యంత్రాంగాన్ని కూడా ప్రచారానికే వాడుకుంటున్నారని మండిపడ్డారు. 

More Telugu News