azaruddin: ఆఫ్ఘనిస్థాన్ విషయంలో ఐసీసీ తొందరపడింది: అజారుద్దీన్

  • లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్ లలో ఆఫ్ఘాన్ ప్రదర్శన బాగుంది
  • టెస్టు మ్యాచ్ లు ఆడటానికి వారికి మరింత సమయం ఇవ్వాల్సింది
  • భారత్ తో జరిగిన టెస్టు వారికి ఓ పాఠంలాంటిది

ఇంగ్లండ్ లో 2019లో జరగనున్న ప్రపంచకప్ కు అర్హత సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ఆఫ్ఘనిస్థాన్. లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్ లలో ప్రతిభను కనబరుస్తున్న ఆఫ్ఘాన్ జట్టు... టెస్టు మ్యాచ్ లో మాత్రం తేలిపోయింది. బెంగుళూరులో తన కెరియర్ లోనే తొలి టెస్టును భారత్ తో ఆఫ్ఘనిస్థాన్ ఆడింది. రెండు రోజుల్లోనే ముగిసి ఈ మ్యాచ్ లో... ఆఫ్ఘాన్ ఘోరంగా ఓడిపోయింది.

ఈ నేపథ్యంలో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్ మంచి జట్టేనని అభిప్రాయపడ్డాడు. లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్ లలో ఈ జట్టు మంచి ప్రదర్శన చేస్తోందని చెప్పాడు. అయితే, లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్ లకు, టెస్ట్ మ్యాచ్ లకు ఎంతో తేడా ఉంటుందని... ఆఫ్ఘాన్ జట్టు ఈ ఫార్మాట్ లో రాణించడానికి సమయం పడుతుందని తెలిపాడు. ఆఫ్ఘాన్ జట్టుకు టెస్ట్ హోదా ఇచ్చి ఐసీసీ తొందరపడిందేమోనని అభిప్రాయపడ్డాడు. వారికి మరికొంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని తెలిపాడు. వాళ్లు ఆడిన తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం వారికి ఇబ్బందిని కలిగించి ఉంటుందని... అయితే లోపాలను అధిగమించడానికి వారికి ఈ టెస్టు ఓ పాఠంలాంటిదని చెప్పాడు.

More Telugu News