China: బీజింగ్ లో రాత్రి పది తర్వాత పురుష డ్రైవర్ల క్యాబ్ లు మహిళా ప్రయాణికులను తీసుకెళ్లడంపై నిషేధం!

  • బీజింగ్‌లో రెండు అత్యాచార ఘటనలు
  • డీడీ క్యాబ్ సర్వీసులపై నిషేధం
  • మహిళా డ్రైవర్ల క్యాబ్ లే మహిళలను ఎక్కించుకోవాలి 

రాత్రి పది గంటల తర్వాత పురుష క్యాబ్ డ్రైవర్లు మహిళా ప్రయాణికులను ఎక్కించుకోవడంపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. ఇటీవల ఇద్దరు మహిళలపై బీజింగ్‌లో ట్యాక్సీ డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడిన విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నగరంలో ఇప్పటికే చాలినంతమంది మహిళా డ్రైవర్లు ఉన్నారని, ఇకపై వారే మహిళలను ఎక్కించుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతారని అధికారులు తెలిపారు.

క్యాబ్ సర్వీసుల సంస్థ డీడీని తాత్కాలికంగా రద్దు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం దాని సర్వీసులను పరిమితం చేసింది. సేమ్-సెక్స్ రూల్‌ను పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు అర్ధరాత్రి నుంచి ఉదయం ఆరింటి వరకు సేవలు అందించకుండా నిషేధం విధించింది.
 
21 ఏళ్ల మహిళపై 35 ఏళ్ల కారు డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. బీజింగ్ శివారులో ఈ ఘటన జరిగింది. మరో ఘటనలో 22 ఏళ్ల యువతిని ఎక్కించుకున్న డ్రైవర్ నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపాడు. అయితే, డ్రైవర్‌పై అనుమానంతో అప్పటికే ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించింది. కారును ఆపిన డ్రైవర్ ఆమెను బలవంతంగా వెనక సీట్లోకి తీసుకెళ్లాడు. అదే సమయంలో బాధిత మహిళ తల్లిదండ్రులు అక్కడికి చేరుకోవడంతో డ్రైవర్ పరారయ్యాడు. ఈ రెండు ఘటనల్లోనూ నిందితులు డీడీ సంస్థకు చెందిన వారే. ఈ ఘటనలపై స్పందించిన ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News