USA: గ్రీన్ కార్డు రావాలంటే 151 ఏళ్లు నిరీక్షించాల్సిందే... అమెరికాలోని 4 లక్షల మంది భారతీయుల పరిస్థితి!

  • పెండింగ్ లోని గ్రీన్ కార్డు దరఖాస్తుల సంఖ్య 6.32 లక్షలకు పైగానే
  • వాటిల్లో ఈబీ-2 దరఖాస్తులు 4 లక్షలకు పైగా
  • చట్టాలు సవరించకుంటే ఇబ్బందులేనన్న కాటో ఇనిస్టిట్యూట్

దాదాపు నాలుగు లక్షల మంది భారతీయుల 'డాలర్ డ్రీమ్స్' కలలుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. గ్రీన్ కార్డు వస్తుందన్న ఆశతో వేచి చూస్తున్న వారికి తీవ్ర నిరాశను కలిగించేలా, వీరు 151 సంవత్సరాలు వేచి చూస్తేనే గ్రీన్ కార్డు లభిస్తుందని కాటో ఇనిస్టిట్యూట్ తన రిపోర్టులో పేర్కొంది. గ్రీన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్యను యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూస్ సీఐఎస్) వెల్లడించగా, కాటో ఇనిస్టిట్యూట్ విశ్లేషణా రిపోర్టును విడుదల చేసింది.

యూఎస్ లో శాశ్వత నివాసాన్ని, ఉద్యోగాన్ని కోరుకునే అడ్వాన్డ్స్ డిగ్రీలు ఉన్న భారతీయులు వేచి చూడాల్సిన కాలం 150 సంవత్సరాలు దాటి పోయిందని వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ పేర్కొంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 20 నాటికి 6,32,219 మంది భారతీయ ఉద్యోగులు, వారి భార్యలు, మైనర్ చిన్నారులు గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారు. వీరిలో అత్యంత నైపుణ్యవంతులైన ఉద్యోగులు ఈబి-1 కేటగిరీలో ఆరేళ్ల పాటు వేచి చూస్తేనే గ్రీన్ కార్డు లభించే పరిస్థితి ఉందని, ఈ కేటగిరీలో 34,824 దరఖాస్తులు ఉన్నాయని తెలిపింది. ఈబీ-3 ఇమిగ్రెంట్స్ 17 సంవత్సరాలు వేచి చూడాలని, ఈ జాబితాలో 54,892 వీసా దరఖాస్తులు ఉన్నాయని పేర్కొంది.

ఇక అత్యధిక సమయం వేచి చూడాల్సిన కేటగిరీ ఈబీ-2గా పేర్కొన్న కాటో ఇనిస్టిట్యూట్, ఈ జాబితాలో 2,16,684 వీసా దరఖాస్తులు ఉన్నాయని, వారి భార్యా పిల్లల దరఖాస్తులను కలిపితే, ఆ సంఖ్య 4,33,368 అని తెలిపింది. 2017లో కేవలం 22,602 మంది భారతీయులకు మాత్రమే పర్మినెంట్ రెసిడెన్సీ కార్డులు లభించాయని యూఎస్ సీఐఎస్ తెలిపింది. ప్రస్తుతమున్న చట్టాలు మార్చకుంటే, లక్షలాది మంది విదేశీయులు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిగా ముద్ర పడతారని కాటో ఇనిస్టిట్యూట్ హెచ్చరించింది.

More Telugu News