Chandrababu: త్వరలో మైనార్టీల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తాం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

  • రంజాన్‌ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి
  • ముస్లిం సంప్రదాయ పద్ధతిలో నమాజ్‌ చేసిన చంద్రబాబు
  • మతసామరస్యాన్ని కాపాడేందుకు అధిక ప్రాధాన్యం

విజయవాడ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన రంజాన్‌ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ముస్లింలతో కలిసి చంద్రబాబు కూడా సంప్రదాయ పద్ధతిలో నమాజ్‌ చేశారు. ఉర్దూలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీల కోసం రూ.1102 కోట్ల బడ్జెట్ ను ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించామని.. ఇమామ్, మౌజమ్‌లకు ఎక్కడా లేని విధంగా వేతనాలు ఇస్తున్నామని చంద్రబాబు అన్నారు.
మైనార్టీల కోసం త్వరలో 25 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ముస్లిం మైనార్టీల కోసం ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా పథకాలు అమలు చేస్తున్నామని, మతసామరస్యాన్ని కాపాడేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లింలను ప్రాసిక్యూట్ చేస్తామంటే మొదట వ్యతిరేకించింది తానేనని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.


More Telugu News