botsa: కేంద్రం మెడలు వంచి రాష్ట్రాభివృద్ధికి కృషి చేసేది వైసీపీనే: బొత్స

  • ఏపీకి టీడీపీ, బీజేపీలు నష్టం కలిగించాయి
  • బీజేపీకి వైసీపీతో సంబంధాలున్నాయన్నది టీడీపీ దుష్ప్రచారం  
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది

కేంద్రం మెడలు వంచి రాష్ట్రాభివృద్ధికి పాటుపడేది వైసీపీయేనని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి టీడీపీ, బీజేపీలు నష్టం కలిగించాయని విమర్శించారు. బీజేపీకి వైసీపీతో సంబంధాలు ఉన్నాయని టీడీపీ దుష్ప్రచారం చేయడం తగదని అన్నారు.

చంద్రబాబునాయుడి దోపిడీని పుస్తకరూపంలో తీసుకొస్తామని, దేశంలోని అన్ని పార్టీల నేతలకు వాటిని అందజేస్తామని చెప్పారు. టీడీపీలా ట్యాంపరింగ్ చేసుకునే సంస్కృతి తమకు లేదని, అన్ని విషయాలు ప్రజలకు చెబుతామని, అప్పుడు ఎవరు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారో తెలుస్తుందని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన ఢిల్లీకి వెళితే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని బొత్స ప్రశ్నించారు. అలాగే అయితే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ నివాసానికి టీడీపీ నేతలు వెళ్లలేదా? అని ప్రశ్నించారు.

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ సీఎం చంద్రబాబు పక్కనే ఉంటారని, మహారాష్ట్రకు చెందిన మంత్రి భార్య టీటీడీలో సభ్యురాలని.. ఈ విషయాలను పరిశీలిస్తే ఎవరు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారో ప్రజలకు తెలుస్తుందని అన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో అమర్ సింగ్ చంద్రబాబును కలిసింది నిజం కాదా? అగ్రిగోల్డ్ రామారావును ఎందుకు కలిశారో చంద్రబాబు చెప్పాలి? అని డిమాండ్ చేశారు. ఏపీలో సంస్థల ఏర్పాటుకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే వైసీపీ పోటీ చేస్తుందని బొత్స తెలిపారు.

More Telugu News