Chandrababu: చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసేందుకు బీజేపీ నేతల వ్యూహం.. నాలుగు రోజులుగా వరుస సమావేశాలు!

  • చంద్రబాబును దెబ్బకొట్టేందుకు బీజేపీ రెడీ
  • చేతులు మారిన కీలక సమాచారం
  • వరుస భేటీలతో వ్యూహాలు సిద్ధం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో దారుణంగా దెబ్బ కొట్టేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. నాలుగు రోజులుగా వరుస సమావేశాలతో బిజీగా ఉంది. వ్యూహప్రతివ్యూహాల్లో ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ వరుస మంతనాలతో తీరిక లేకుండా ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించడం, వ్యూహరచనే ప్రధానంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, నేతలు పురందేశ్వరి, ఆకుల సత్యనారాయణ తదితరులు ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాతి నుంచి ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. బుధవారం మోదీని కలిసిన కన్నా, ఆ తర్వాత పీఎంఓ అధికారులతోనూ సమావేశమయ్యారు.

ఆకుల సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన గురువారం రాంమాధవ్‌ను కలిశారు. శుక్రవారం గవర్నర్ నరసింహన్.. ఉదయం రాజ్‌నాథ్ సింగ్, సాయంత్రం ప్రధాని మోదీని కలిశారు. ఏపీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఇలా ఢిల్లీలో వరుసపెట్టి మోదీ, షాలను కలవడం, సమావేశాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చంద్రబాబు టార్గెట్‌గానే ఈ మొత్తం వ్యవహారం నడుస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా కీలక సమాచారం కూడా చేతులు మారినట్టు తెలుస్తోంది. చంద్రబాబుపై ముప్పేట దాడికి సిద్ధమవుతున్న బీజేపీ.. అందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించిందని చెబుతున్నారు. ఇటీవలే గవర్నర్‌ను కలిసిన ప్రధాని మళ్లీ ఇంతలోనే ఆయనను కలవడం వెనక ఉన్న వ్యూహం ఇదేనని అంటున్నారు.

More Telugu News