Venkaiah Naidu: వెంకయ్య సాహసం! భారీ వర్షం, ఈదురు గాలుల మధ్య ఉప రాష్ట్రపతి పర్యటన

  • అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం పర్యటనలో ఉప రాష్ట్రపతి
  • ప్రతికూల వాతావరణంలో రెండు గంటల ప్రయాణం
  • భద్రతాధికారులు వారిస్తున్నా వెనక్కి తగ్గని వెంకయ్య

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సాహసం చేశారు. ఓ వైపు భారీ వర్షం, మరోవైపు ఈదురు గాలులు.. అయినా లెక్కచేయకుండా గతుకుల రోడ్డులో రెండు గంటలకుపైగా ప్రయాణం చేశారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు వెళ్లిన ఉపరాష్ట్రపతి పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. సిబ్బందికి ధైర్యం చెప్పి మరీ తనతోపాటు తీసుకెళ్లారు.

శుక్రవారం వెంకయ్యనాయుడు గ్యాంగ్‌టక్ బయలుదేరారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా విమానాశ్రయంలో దిగారు. భారీ వర్షం పడుతుండడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోదామని భద్రతాధికారులు ఆయనకు సూచించారు.

హెలికాప్టర్‌లో ప్రయాణించడం ప్రమాదకరమని చెప్పారు. నిజానికి శనివారం ఆయన అరుణాచల్‌ప్రదేశ్ వెళ్లాల్సి ఉండడంతో ముందుగా అక్కడికే వెళ్దామంటూ ప్రతికూల వాతావరణంలోనే బయలుదేరారు. అసోంలోని లీలాబరి  విమానాశ్రయంలో దిగారు. అయితే, అక్కడ కూడా ప్రతికూల వాతావరణమే ఎదురైంది. భద్రతాధికారులు మళ్లీ హెచ్చిరించినా ఆయన వినిపించుకోలేదు.

వెనక్కి వెళ్లేందుకు ఇష్టపడని వెంకయ్య రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రెండు గంటలపాటు గతుకుల రోడ్డులో ప్రయాణించి ఎట్టకేలకు చేరుకున్నారు. తాను ఏదైనా కార్యక్రమాన్ని నిర్ణయిస్తే ముందుకు వెళ్లేందుకే ఇష్టపడతానని ఈ సందర్భంగా వెంకయ్య పేర్కొన్నారు. ప్రయాణ బడలిక కన్నా ప్రజలను కలవడమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.

More Telugu News