vijay rupani: హార్ధిక్ పటేల్ వ్యాఖ్యలను ఖండించిన గుజరాత్ ముఖ్యమంత్రి

  • నేను రాజీనామా చేయలేదు
  • కేబినెట్ మీటింగ్ లో రాజీనామాలు చేయరన్న సంగతి కూడా ఆయనకు తెలియదా?
  • కాంగ్రెస్ ఏజెంట్ లా హార్ధిక్ వ్యవహరిస్తున్నారు

గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేశానంటూ పటిదార్ ఉద్యమనేత హార్ధిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలను విజయ్ రూపానీ ఖండించారు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకు హార్ధిక్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. రాజీనామాలు కేబినెట్ సమావేశాల్లో చేయరని, రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖ ఇస్తారని... ఈ మాత్రం కూడా హార్ధిక్ కు తెలియదా? అంటూ ఎద్దేవా చేశారు. కేబినెట్ సమావేశంలో కానీ, పార్టీలో కానీ రాజీనామాకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లా హార్ధిక్ వ్యవహరిస్తున్నారని విజయ్ రూపానీ మండిపడ్డారు. గుజరాత్ అభివృద్ధిని అడ్డుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వారికి ఆవేదనను మిగిల్చి ఉంటాయని... అందుకే ఇలా దిగజారి ప్రవర్తిస్తున్నారని అన్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి రాజీనామా చేశారన్న వార్తలను ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ కూడా ఖండించారు. బీజేపీ వ్యతిరేకులు చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలే అని అన్నారు. 

More Telugu News