నీరవ్ మోదీ బ్రస్సెల్స్ లో ఉన్నాడా?.. ఎన్డీటీవీ ఆసక్తికర కథనం!

15-06-2018 Fri 11:01
  • బెల్జియం క్యాపిటల్ బ్రస్సెల్స్ లో నీరవ్ మోదీ
  • ఫేక్ పాస్ పోర్టులతో ప్రయాణం
  • సింగపూర్ పాస్ పోర్టు కూడా ఉందంటూ మరో కథనం

రూ. 13,000 కోట్ల మేరకు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి, విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ అచూకీ కనుక్కునేందుకు భారత అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. మోదీ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఇండియా నుంచి లండన్ కు... అక్కడి నుంచి బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ కు నీరవ్ మోదీ పారిపోయాడని విశ్వసనీయంగా తెలుస్తోందంటూ ఎన్డీటీవీ వెబ్ పోర్టల్ ఓ కథనాన్ని ప్రచురించింది. భారత్ కు చెందిన పలు ఫేక్ పాస్ పోర్టులతో ఆయన ప్రయాణిస్తున్నాడని తెలిపింది. ఇండియా నుంచి చెక్కేసిన తర్వాత ఆయన యూరోప్ లో పలు చోట్లకు ప్రయాణించాడని వెల్లడించింది.

అధికారుల కథనం ప్రకారం ఒరిజినల్ పాస్ పోర్టుతోనే నీరవ్ లండన్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత అతని పాస్ పోర్టును భారత ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం ఆయన ఫేక్ పాస్ పార్టులు వాడుతూ ప్రయాణిస్తున్నాడు. మోదీకి సింగపూర్ పాస్ పోర్టు కూడా ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ, సింగపూర్ పాస్ పోర్టుతోనే మోదీ ఇండియా నుంచి లండన్ కు వెళ్లిపోయాడని తెలిపారు.

గతం వారం ఫైనాన్షియల్ టైమ్స్ కూడా ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. లండన్ లోని సంపన్న ప్రాంతమైన మేఫెయిర్ లో మోదీ ఉన్నాడని... రాజకీయ ఆశ్రయం (పొలిటికల్ అసైలమ్) కోరుతున్నాడని తెలిపింది.