Telangana: ఈ నెల 25లోగా పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు: తెలంగాణ మంత్రి జూపల్లి

  • బీసీ ఓటర్ల గణన పూర్తవుతోంది 
  • బీసీలకు 34 శాతం రిజర్వేషన్
  • జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 20 శాతం
  • ఎస్టీలకు 6 శాతం

నిర్ణీత గడువులోగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలు పూర్తవుతున్నాయని, ఈ నెల 25లోగా ఆ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు.

గత రెండు, మూడు నెలలుగా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను నిర్వహిస్తున్నామని, పూర్తి పారదర్శకంగా నిర్ణీత గడువులోగా ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జూపల్లి చెప్పారు. గ్రామీణ బీసీ ఓటర్ల గణన పూర్తి కావచ్చిందని, గత పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే ఈ సారి కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు ఉంటాయన్నారు.

అలాగే, 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న 1170 పంచాయతీలతో పాటు... మరో 1300 షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉన్న పంచాయతీలను కూడా ఎస్టీలకే రిజర్వ్ చేస్తామన్నారు. ప్రతి కేటగిరిలోను మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉంటుందన్నారు. గ్రామం యూనిట్ గా వార్డ్ మెంబర్ కు, మండలం యూనిట్ గా సర్పంచ్ లకు రిజర్వేషన్లు ఉంటాయన్నారు. ఎన్నికల అనంతరం ప్రజాప్రతినిధులకు 3 నెలల పాటు నూతన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 

More Telugu News