blood: రక్తం పెంచుకోండిలా... ప్రపంచ రక్తదాన దినోత్సవం ఈ రోజు

  • ఐరన్ లోపమే ప్రధానంగా రక్తహీనతకు కారణం
  • ఫోలిక్ యాసిడ్ పాత్ర కూడా ఉంది
  • ఆహారం, జీవన విధానంలో మార్పులతో రక్త హీనత సమస్యకు చెక్

శరీర వ్యవస్థకు జీవమైన ఆక్సిజన్ అందాలంటే అందుకు రక్తం అవసరం. అన్ని అవయవాలకు ఆయువు అయిన రక్తం ప్రాణాలను కాపాడుతుంది. ఆపదలో ఉన్న వారికి చేసే రక్తదానం ప్రాణాల్ని నిలబెడుతుంది. అయితే, అవసరంలో ఉన్న వారికి రక్తం దానం చేయాలంటే అందుకు మీలో రక్త హీనత ఉండకూడదు. రక్తహీనత ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొన్ని జీవనపరమైన మార్పులతో రక్తం సమృద్ధిగా ఉండే విధంగా చూసుకోవచ్చు.

ఐరన్ లోపం సాధారణంగా ఎక్కువమందిలో రక్త హీనతకు కారణమవుతోంది. ఆకుపచ్చని కూరగాయలు, బీట్ రూట్, చికెన్ లివర్, గుడ్డు, యాపిల్, దానిమ్మ, ఆప్రికాట్, పుచ్చకాయ, గుమ్మడి విత్తులు, ఖర్జూరాలు, బాదం, బెల్లం తదితర పదార్థాల్లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.

ఇక ఐరన్ తో పాటు విటమిన్ సి తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఐరన్ ను మన శరీరం మెరుగ్గా గ్రహించేందుకు విటమిన్ సి ఉపయోగపడుతుంది. విటమిన్ సి కోసం నిమ్మ, కమలా, బత్తాయి, స్ట్రాబెర్రీ, బొప్పాయి, ద్రాక్ష, టమాటాలను తీసుకోవచ్చు.

ఫోలిక్ యాసిడ్ అనేది విటమిన్ బి గ్రూపులోనిది. ఎర్ర రక్త కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఆకుపచ్చని కూరగాయలు, అరటి పండు, చికెన్ లివర్, బీట్ రూట్, గోధుమల్లో ఫోలిక్ యాసిడ్ తగినంత లభిస్తుంది.

ఇక కొన్ని ఆహార పదార్థాలు శరీరాన్ని ఐరన్ గ్రహించనీయకుండా అడ్డుపడుతుంటాయి. వాటికి దూరంగా ఉండాలి. కాఫీ, టీ, ఫిజీ డ్రింక్స్, వైన్, బీర్ కు దూరంగా ఉండాలి.

శారీరక వ్యాయామం ఓ మోస్తరు స్థాయిలో చేయడం వల్ల మన శరీరం మరింత హెమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే వ్యాయామం సమయంలో అధిక ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఆ డిమాండ్ ను తీర్చేందుకు హెమోగ్లోబిన్ మరింత ఉత్పత్తి అవుతుంది.

More Telugu News