New Zealand: న్యూజిలాండ్ బ్యాట్స్ విమెన్ సంచలనం.. 21 ఏళ్ల రికార్డు బద్దలు

  • 145 బంతుల్లో 232 పరుగులు చేసిన బ్యాట్స్ విమెన్
  • మహిళా వన్డేల్లో రెండో డబుల్ సెంచరీ నమోదు
  • ఐర్లండ్‌పై వైట్‌ఫెర్న్స్ ఘన విజయం

17 ఏళ్ల న్యూజిలాండ్ బ్యాట్స్ విమెన్, స్పిన్నర్ అమెలియా కెర్ రికార్డు సృష్టించింది. 145 బంతుల్లో అజేయంగా 232 పరుగులు చేసి 21 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టింది. బుధవారం ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ బౌలర్లను అమెలియా ఆటాడుకుంది. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడింది. 31 ఫోర్లు, రెండు సిక్సర్లతో 232 పరుగులు సాధించి మహిళల వన్డేలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌విమెన్‌గా రికార్డులకెక్కింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వైట్ ఫెర్స్ జట్టు కెర్ దెబ్బకు నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 440 పరుగులు చేసింది. మరో బ్యాట్స్ విమెన్ ఎల్ఎం కాస్పెరక్ సెంచరీ (113)తో అదరగొట్టింది. అనంతరం 441 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లండ్ జట్టు 44 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా, కెర్ వీరబాదుడుకు  ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ బెలిండా క్లార్క్ రికార్డు బద్దలైంది. 1997లో డెన్మార్క్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో క్లార్క్ 155 బంతుల్లో అజేయంగా 229 పరుగులు చేసింది. ఇప్పటి వరకు భద్రంగా ఉన్న ఆ రికార్డును కెర్ బద్దలు గొట్టింది. కాగా, మహిళల వన్డేల్లో ఇప్పటి వరకు డబుల్ సెంచరీలు సాధించింది  వీరిద్దరే కావడం గమనార్హం.

More Telugu News