akhilesh yadav: అఖిలేశ్ యాదవ్ పై చర్యలు తీసుకోండంటూ యూపీ సీఎంకు గవర్నర్ లేఖ

  • ప్రజల పన్నులతో ప్రభుత్వ భవనాల నిర్వహణ
  • నష్టం జరిగితే అది తీవ్రమైన అంశమే
  • నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచన 

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఖాళీ చేసిన ప్రభుత్వ భవనానికి నష్టం వాటిల్లినట్టు వార్తలు రావడంతో దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ ఈ రోజు ప్రభుత్వానికి సూచించారు. విక్రమాదిత్య మార్గ్ లోని అఖిలేశ్ ఖాళీ చేసిన భవనానికి నష్టం వాటిల్లినట్టు మీడియాలో, సామాన్య ప్రజల్లో చర్చకు వచ్చిన విషయాన్ని పేర్కొంటూ, ఇది చాలా సీరియస్ అంశమని, పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో ముడిపడినదిగా గవర్నర్ పేర్కొన్నారు.

ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు.  మాజీ ముఖ్యమంత్రులకు కేటాయించే భవనాల మరమ్మతులను ప్రజలు చెల్లించిన పన్నులతోనే నిర్వహించే విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు వాటిల్లిన నష్టంపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాల్సి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రులు ఖాళీ చేసిన భవనాలను వీడియో తీసినట్టు ఎస్టేట్ అధికారులు గవర్నర్ కు తెలియజేశారు. ఏవైనా కనిపించకుండా పోయినా, ఉద్దేశపూర్వక నష్టం కలిగించినా నోటీసులు జారీ చేయనున్నట్టు రాష్ట్ర ఎస్టేట్స్ డిపార్ట్ మెంట్ తెలిపింది.

More Telugu News