TTD: విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేసిన టీటీడీ

  • టీటీడీ, ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు
  • చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్న టీటీడీ
  • వివరణ ఇవ్వాలంటూ నోటీసులు

తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు తిరుమల తిరుపతి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలకు టీటీడీ బోర్డు నోటీసులు జారీ చేసింది. వీరు చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొంది. టీటీడీపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని తెలిపింది. గత నెల 15వ తేదీన చెన్నైలో రమణ దీక్షితులు మాట్లాడుతూ... టీటీడీ, ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే విజయసాయి రెడ్డి కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పోటులో తవ్వకాలు జరిగాయని, చంద్రబాబు ఇంట్లో సోదాలు నిర్వహిస్తే నగలు బయట పడతాయని విజయసాయి ఆరోపించారు.

ఈ నేపథ్యంలో, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వీరిద్దరూ వ్యాఖ్యానించారని, వీరికి నోటీసులు జారీ చేయాలని ఈ నెల 5న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు వీరిద్దరికీ పోస్టు ద్వారా నోటీసులు జారీ చేశారు. టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరికొందరికి కూడా కొన్ని రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. 

More Telugu News