శాంసంగ్ ఫోన్ నుంచి మంటలు.. కాలి బూడిదైన కారు!

11-06-2018 Mon 18:50
  • అమెరికాలోని మిచిగాన్ లో ఘటన
  • కారులో నుంచి దూకేసి, ప్రాణాలు కాపాడుకున్న మహిళ
  • దర్యాప్తు చేస్తామని ప్రకటించిన శాంసంగ్
సెల్ ఫోన్లు పేలిపోతున్న వార్తలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా అమెరికాలోని మిచిగాన్ లో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే, మిచిగాన్ కు చెందిన నిస్సాన్ మాగ్జిమా అనే మహిళ కారును డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా, ఆమె దగ్గరున్న రెండు శాంసంగ్ ఫోన్లలో ఒకదాని నుంచి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కారంతా వ్యాపించాయి.

దీంతో, పక్కనే వెళ్తున్న వారు కారు నుంచి దూకేయాలంటూ సూచించారు. వెంటనే కారును రోడ్డు పక్కకు తీసుకొచ్చి, అందులో నుంచి ఆమె దూకేసింది. దీంతో, ప్రాణాలతో బయటపడిపోయింది. మరోవైపు, ఈ ఘటనలో కారు బూడిదైపోయింది. ఈ విషయం గురించి తెలుసుకున్న శాంసంగ్... మంటలు ఎందుకు వచ్చాయో దర్యాప్తు చేస్తామని తెలిపింది.