Donald Trump: చారిత్రక చర్చలకు రంగం సిద్ధం.. ప్రపంచం చూపంతా సింగపూర్ వైపే!

  • ఇప్పటికే సింగపూర్ చేరుకున్న ట్రంప్, కిమ్
  • వివిధ దేశాలకు చెందిన 3 వేల మంది పాత్రికేయులు కూడా
  • అణ్వస్త్రాలు సహా పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం

యావత్ ప్రపంచం ఇప్పుడు సింగపూర్ వైపు చూస్తోంది. కారణం.. చారిత్రక చర్చలకు ఆ దేశం వేదిక కావడమే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్‌లు రేపు (మంగళవారం) ఓ హోటల్లో సమావేశం కానున్నారు. మాటల తూటాలు పేల్చుకున్న ఇద్దరు దేశాధి నేతలు కలుసుకోబోతున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అయితే, అసలు ఏం చర్చించనున్నారు? వారి నుంచి ఎటువంటి ప్రకటన వెలువడుతుంది? అన్నది ఉత్కంఠ రేపుతున్న మరో అంశం.

సింగపూర్‌లో తొలిసారి జరగనున్న ఈ చారిత్రక చర్చల కోసం సర్వం సిద్ధమైంది. అంతేకాదు, దీనిని కవర్ చేయడానికి వివిధ దేశాలకు చెందిన 3 వేల మంది జర్నలిస్టులు కూడా సింగపూర్ చేరుకున్నారు. ఇప్పటికే ఇద్దరు అగ్ర నేతలూ సింగపూర్ చేరుకున్నారు. వారు బస చేస్తున్న హోటళ్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యం ఉంది. అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడితో ఉత్తరకొరియా చీఫ్ భేటీ కావడం ఇదే తొలిసారి. ఇక అంతర్జాతీయ వేదికలపై కిమ్ కనిపించడం చాలా అరుదు. ఇప్పటి వరకు ఆయన చైనా, దక్షిణ కొరియాలో మాత్రమే పర్యటించారు. అది కూడా ఇటీవలే!

కాగా, ట్రంప్-కిమ్ భేటీలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అణ్వాయుధాలను పూర్తిగా విడిచిపెట్టాలన్న అంశం చర్చకు రావొచ్చని భావిస్తున్నారు. అలాగే ఉభయ కొరియాల మధ్య ఉన్న శత్రుత్వానికి ఫుల్‌స్టాప్ పెట్టాలన్న ప్రయత్నాలు జరగొచ్చు. మరోవైపు అమెరికా తమకు భద్రతాపరమైన హామీ ఇస్తే కనుక అణు కార్యక్రమాలకు చెక్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు నార్త్ కొరియా ఇప్పటికే ప్రకటించింది. ఈ విషయంలో అమెరికా సానుకూలంగా స్పందించనున్నట్టు సమాచారం.

More Telugu News