Haryana: మహిళా ఐఏఎస్ అధికారిపై సీనియర్ అధికారి లైంగిక వేధింపులు.. ఫేస్‌బుక్‌లో పంచుకున్న బాధితురాలు!

  • తన కార్యాలయానికి పిలిపించుకుని వేధింపులు
  • కొత్త పెళ్లి కూతురులా అన్నీ వివరించాల్సి వస్తోందన్న అధికారి
  • ఫేస్‌బుక్‌లో పంచుకున్న అధికారిణి

రంగమేదైనా మహిళలపై లైంగిక వేధింపులు మామూలేనని తాజాగా జరిగిన ఓ ఘటన నిరూపిస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తనను లైంగికంగా వేధించారంటూ మహిళా ఐఏఎస్ అధికారి ఒకరు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది.

గత నెల 22న సదరు అధికారి తనను ఆయన కార్యాలయానికి పిలిపించుకుని బెదిరించారని బాధిత అధికారిణి (28) అందులో పేర్కొన్నారు. ఆయా విభాగాలు చేసిన తప్పుల గురించి ఫైల్స్ ఎందుకు సిద్ధం చేస్తున్నారని ప్రశ్నించారని, వాటిని ఆపకపోతే వ్యతిరేకంగా వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

31న మరోమారు తన గదికి పిలిచి వేధించారని, గదిలోకి ఎవరినీ  పంపవద్దని సిబ్బందికి సూచించారని పేర్కొన్నారు. మరో సందర్భంలో కొత్త పెళ్లి కూతురులా అన్నీ వివరించాల్సి వస్తోందని అన్నారని తెలిపారు. ఈనెల 6వ తేదీన సాయంత్రం మళ్లీ తన గదికి పిలిచి రాత్రి వరకు ఉండమన్నారని, తనకు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించారని ఆ పోస్టులో వివరించారు.

అయితే, తనపై మహిళా ఐఏఎస్ అధికారి చేసిన ఆరోపణలను సీనియర్ అధికారి కొట్టిపడేశారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని తేల్చి చెప్పారు. ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ఆమె తన కార్యాలయంలో ఒంటరిగా ఎప్పుడూ లేరన్నారు. ఆమెతో పాటు ఒకరిద్దరు ఉండేలా చూసుకున్నానన్నారు. అధికారులు అప్పటికే క్లియర్ చేసిన ఫైళ్లలో తప్పులు వెతకడాన్ని మాత్రమే తాను తప్పుపట్టినట్టు చెప్పారు. ఆమె యువ అధికారిణి కావడంతో ఆమెకు పని నేర్పాలని మాత్రమే అనుకున్నానని వివరణ ఇచ్చారు.

More Telugu News