Harish Rao: ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం మూసేస్తోంది.. తెలంగాణ సర్కారు బలోపేతం చేస్తోంది: హరీశ్‌ రావు

  • ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు కార్మికులు సహకరించాలి
  • మూడు రోజుల్లో ఓ ఉన్నతస్థాయి కమిటీ వేస్తాం
  • ఆర్టీసీ నష్టాలను తగ్గించడానికి కమిటీ అధ్యయనం

ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఈరోజు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు సఫలమయ్యాక ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓవైపు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం మూసేస్తోందని, మరోవైపు కేసీఆర్‌ మాత్రం వాటిని బలోపేతం చేస్తున్నారని అన్నారు. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు కార్మికులు సహకరించాలని, ఆర్టీసీ లాభాల సంస్థగా ఉండాలన్నది కేసీఆర్ కోరికని అన్నారు.

ఫిట్‌మెంట్‌ ఇచ్చేనాటికి ఆర్టీసీని బలోపేతం చేయాలన్నది కేసీఆర్‌ ఆలోచనని హరీశ్‌ రావు అన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. మూడు రోజుల్లో ఓ ఉన్నతస్థాయి కమిటీ వేస్తామని, ఆర్టీసీ అప్పులు, నష్టాలను తగ్గించడానికి ఉన్న మార్గాలపై కమిటీ అధ్యయనం చేస్తుందని అన్నారు. ఆర్టీసీని శాశ్వతంగా కాపాడుకోవాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు.

More Telugu News