kumaraswamy: 8వ తరగతి వరకు చదువుకున్న వ్యక్తికి ఉన్నత విద్యాశాఖను అప్పగించిన కుమారస్వామి!

  • జీటీ దేవెగౌడకు ఉన్నత విద్యాశాఖ
  • విమర్శలపై స్పందించిన సీఎం
  • తాను డిగ్రీ మాత్రమే చదువుకున్నానన్న సీఎం

కుమారస్వామి కేబినెట్‌లో ఉన్నత విద్యాశాఖామంత్రి పదవి పొందిన జీటీ దేవెగౌడ విద్యార్హతపై ఇప్పుడు వివాదం రాజుకుంది. 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఆయనకు కుమారస్వామి ఏకంగా ఉన్నత విద్యాశాఖను అప్పగించారు. ఈ విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం కుమారస్వామి కాస్తంత ఘాటుగానే స్పందించారు. తానేం చదువుకున్నానని ముఖ్యమంత్రిని అయ్యానని ప్రశ్నించారు.

మరోవైపు ఉన్నత విద్యాశాఖను తనకు కేటాయించడంపై జీటీ దేవెగౌడ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తాను కోరిన శాఖ దక్కలేదని అలకబూనారు. చాముండేశ్వరి నగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఓడించారు.

8వ తరగతి చదువుకున్న జీటీ దేవెగౌడకు విద్యాశాఖను కేటాయించడంపై వస్తున్న విమర్శలకు కుమారస్వామి స్పందిస్తూ.. తాను బీఎస్సీ మాత్రమే చదువుకున్నానని, అయినా ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పుకొచ్చారు. కొన్ని మంత్రి పదవులకు డిమాండ్ ఉంటుందని, అయితే అందరికీ అన్నీ కేటాయించలేమని స్పష్టం చేశారు. అదంతా పార్టీ అంతర్గత నిర్ణయమని పేర్కొన్నారు. తొలుత మంత్రి పదవి దక్కితే చాలనుకోవడం, తర్వాత నచ్చిన శాఖ కావాలనుకోవడం సాధారణమేనని అన్నారు.

More Telugu News