railway stations: 400 రైల్వే స్టేషన్లలో గూగుల్ ఉచిత వైఫై సేవలు!

  • నేడు అసోంలోని దిబ్రూగఢ్ రైల్వే స్టేషన్లో అమల్లోకి
  • ఉచిత వైఫై సేవల్లో ఇది 400వ స్టేషన్
  • ప్రకటన జారీ చేసిన గూగుల్

దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను రైల్ టెల్ సహకారంతో గూగుల్ అందిస్తోంది. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో 2016 జనవరిలోనే ఈ సేవలు మొట్టమొదట ప్రారంభమయ్యాయి. ఈ రోజు అసోంలోని దిబ్రూగఢ్ రైల్వే స్టేషన్ లో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. ఉచిత వైఫై సేవల్లో ఇది 400వ రైల్వే స్టేషన్ అని గూగుల్ ప్రకటన జారీ చేసింది. రైల్వే శాఖకు చెందిన టెలికం విభాగమే రైల్ టెల్. లక్షలాది మంది భారతీయులకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండేలా చూడడమే ఈ సేవల ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్టు మొదటి ఏడాదిలోనే 100 రద్దీ రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అమల్లోకి వచ్చాయని గూగుల్ తెలిపింది.

‘‘నెలవారీగా 80 లక్షల మంది యూజర్లు నెట్ వర్క్ కు కనెక్ట్ అవుతున్నారు. భారత్ కు ఇది లైట్ హౌస్ ప్రాజెక్టు వంటిది. అభివృద్ధి చెందుతున్న ప్రతీ ఆర్థిక వ్యవస్థ తమ దేశంలో ప్రతి ఒక్కరికి అనుసంధానత కల్పించాలనుకుంటోంది’’ అని గూగుల్ ఇండియా డైరెక్టర్ కె.సూరి తెలిపారు. గూగుల్ ఉచిత వైఫై సేవలు మొదటి 30 నిమిషాల పాటు ఉచితం. 350ఎంబీ డేటా వరకు వినియోగించుకోవచ్చు.

More Telugu News