Karnataka: కర్ణాటకలో రగిలిపోతున్న కాంగ్రెస్ నేతలు.. ఆందోళనలో కుమారస్వామి

  • కర్ణాటకలో తీవ్రస్థాయికి చేరుకున్న విభేదాలు
  • పదవులు దక్కని కాంగ్రెస్ నేతలు ప్రత్యేక సమావేశం
  • అధిష్ఠానం రంగంలోకి దిగినా ఫలితం శూన్యం

కర్ణాటకలో మంత్రి‘వర్గ’ విభేదాలు ఊపందుకున్నాయి. కేబినెట్ కొలువుదీరి ఒక రోజైనా గడవకముందే కాంగ్రెస్ నేతలు రగలిపోతున్నారు. తమకు న్యాయం చేయకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామంటూ సీనియర్లు అల్టిమేటం జారీ చేశారు. కొందరు నేతల అనుచరులైతే ఏకంగా కేపీసీసీ కార్యాలయం ఎదుట, మరి కొందరు రోడ్లపైన నిరసన వ్యక్తం చేశారు.

ఎంబీ పాటిల్ నివాసంలో అసంతృప్త నేతలంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజు, శివళ్లి, రోషన్‌బేగ్‌, హ్యారీస్‌, రాజు హలగూరు, డాక్టర్‌ సుధాకర్‌ తో పాటు స్వతంత్ర ఎమ్మెల్యే నాగేశ్‌ కూడా పాల్గొన్నారు. సిద్ధరామయ్య ఆప్తులను లక్ష్యంగా చేసుకుని డిప్యూటీ సీఎం పరమేశ్వర కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. దీంతో జరుగుతున్న పరిణామాలను చూసి సీఎం కుమారస్వామి ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు విషయం తెలిసిన కాంగ్రెస్ అధిష్ఠానం పరిస్థితి మరింత ముదరకుండా చర్యలు చేపట్టింది. పార్టీ కార్యాధ్యక్షుడు దినేశ్ గుండూరావ్, సీనియర్ నేత ఆర్వీ దేశ్‌పాండేలు ఎస్ఆర్ పాటిల్ ఇంటికి వెళ్లి బుజ్జగించారు. 2024లో పార్టీ సీఎం అభ్యర్థి కావాలనుకున్న తనకు మంత్రి పదవి కూడా దక్కకుండా చేశారని పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని హెచ్చరించారు.

అసంతృప్త ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ సమావేశమవుతూ వేడిపుట్టిస్తున్నారు. మరో ఎమ్మెల్యే బీసీ పాటిల్ అయితే ఏకంగా రాజీనామా చేస్తానని బెదిరించారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని నాగేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం మంత్రి జమీర్ అహ్మద్ ఎంబీ పాటిల్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపినా ఆయన మెత్తబడలేదు. దీంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి.  

తాజా పరిణామాలపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ తనతో చర్చించిన తర్వాతే మంత్రివర్గ కూర్పు జరిగిందని స్పష్టం చేశారు. ఇంకా ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉన్నందున మిగతా వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News