varanasi: కాశీ ఆలయాన్ని పేల్చివేస్తామంటూ ‘లష్కరే’ హెచ్చరిక..యూపీ సర్కార్ అప్రమత్తం!

  • పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా బెదరింపు లేఖ
  • యూపీలోని కృష్ణ జన్మభూమి, కాశీ ఆలయాలతో పాటు రెండు రైల్వేస్టేషన్లకు బెదిరింపు
  • అప్రమత్తమైన యూపీ పోలీసులు

యూపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను పేల్చివేస్తామంటూ పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరించింది. ఈ మేరకు బెదిరింపు లేఖ రాసింది. మే 29న ఈ లేఖ రైల్వే శాఖకు అందినట్టు సమాచారం. యూపీలోని కృష్ణ జన్మభూమి (మధుర), వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాలతో హపూర్, సహరాన్ పూర్ రైల్వేస్టేషన్లను కూడా పేల్చివేస్తామని బెదిరించారు. ఈ నెల 6, 8, 10 తేదీల్లో ఆయా స్థలాల్లో పేలుళ్లకు పాల్పడతామని ఈ లేఖలో బెదిరించారు.

ఈ నేపథ్యంలో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. బంకీ బిహారీ ఆలయం, మధుర జంక్షన్, మధుర రిఫైనరీ సహా పలు కీలక ప్రాంతాల్లో పోలీసులు, కమెండోలను మోహరించారు. ఈ సందర్భంగా అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, ఈ లేఖను చూసి భయపడాల్సిన పని లేదని బహుశ ఆకతాయిల పని అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

ఈ బెదిరింపు లేఖపై మౌలానా అంబూ షేక్, ఏరియా కమాండర్, ఎల్ ఈటీ జమ్మూ అండ్ కాశ్మీర్ అని సంతకం చేసి ఉందని చెప్పారు. ప్రజలు, పర్యాటకులు పర్యటించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, గస్తీ వాహనాల సంఖ్యను పెంచామని చెప్పారు. 

More Telugu News