Nagma: తమిళనాడు ఇన్ చార్జ్ బాధ్యతల నుంచి నగ్మాను తప్పించిన కాంగ్రెస్... నిర్ణయం వెనుక ఖుష్బూ!

  • గత కొంతకాలంగా ఇద్దరి మధ్యా విభేదాలు
  • కలసి కనిపించడం చాలా అరుదు
  • నగ్మాను తొలగించాలన్న ఫిర్యాదులకు ఖుష్బూ సమర్థన

తమిళనాడులో మహిళా కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా ఉన్న సినీ నటి నగ్మాను తప్పిస్తూ, మంగళవారం నాడు అధిష్ఠానం నిర్ణయం తీసుకోగా, దీని వెనుక ప్రస్తుతం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న మరో సినీ నటి ఖుష్బూ హస్తం ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాట కాంగ్రెస్ లో నెలకొన్న వర్గపోరులో భాగంగా, వీరిద్దరి మధ్యా గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు దిగుమతై, స్థిరపడిన నగ్మా, ఖుష్బూలు చానాళ్ల నుంచే ఒకరంటే ఒకరికి పడనట్టుగా వ్యవహరిస్తున్నారు.

ఇద్దరూ కలసి ఒకే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భాలు చాలా అరుదు. ఇద్దరూ కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద పలుకుబడి కలవారే. అయితే, నగ్మాకు తమిళం తెలియకపోవడం ఆమెకు పెద్ద మైనస్. ఆమె ఖుష్బూలా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోయినా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఝాన్సీ రాణిని లెక్క చేయకపోవడం అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం.

ఓ సమావేశంలో ఝాన్సీ రాణిని దూరంగా కూర్చోవాలని నగ్మా బహిరంగంగా ఆదేశించడంతో విభేదాలు మరింతగా పెరిగాయి. ఆమెను తప్పించాలని ఫిర్యాదులు వెల్లువెత్తగా, వాటిని ఖుష్బూ కూడా సమర్థించినట్టు తెలుస్తోంది. దీని ఫలితమే రాష్ట్ర ఇన్ చార్జ్ బాధ్యతల నుంచి నగ్మాకు ఉద్వాసనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

More Telugu News