Patanjali Ayurveda: యోగి ఆదిత్యనాథ్ ను నిందిస్తూ... కీలక నిర్ణయం తీసుకున్న రాందేవ్ బాబా!

  • మరో రాష్ట్రానికి మెగా ఫుడ్ పార్క్
  • అధికారులు సహకరించడం లేదన్న ఆచార్య బాలకృష్ణ
  • ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని విమర్శలు

  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వైఖరి పట్ల యోగా గురు బాబా రాందేవ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలోని యమునా ఎక్స్ ప్రెస్ వేపై నిర్మించ తలపెట్టిన మెగా ఫుడ్ పార్క్ ను రద్దు చేసుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ నోయిడా పరిధిలోని సుమారు 455 ఎకరాల్లో నిర్మించాలని భావించిన భారీ ప్రాజెక్టును మరో రాష్ట్రానికి తరలించనున్నట్టు 'పతంజలి ఆయుర్వేద' ఎండీ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. కేంద్రం ప్రకటించిన ఫుడ్ పార్క్ స్కీమ్ లో భాగంగా, లక్షలాది మందికి ఉపాధిని కల్పించే ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని, కానీ ప్రభుత్వం నుంచి తమకు ఏ మాత్రం సహకారం అందలేదని ఆయన విమర్శించారు.

"ఈ ప్రాజెక్టుకు యోగి సర్కారు నుంచి ఏ మాత్రం సహకారం అందలేదు. మేము అనుమతుల కోసం చానాళ్లుగా ఎదురుచూసి విసిగిపోయాం. ఇప్పుడిక ప్రాజెక్టును మరో రాష్ట్రానికి తరలించాలని నిర్ణయించాం" అని ఆయన అన్నారు. ప్రాజెక్టుకు అనుమతుల విషయమై పలుమార్లు ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వ అధికారుల వరకూ ఎన్నోసార్లు సమావేశం అయ్యామని, ఏ మాత్రం ప్రయోజనం లేకపోయిందని అన్నారు. ఇప్పటికే ఫుడ్ ప్రాసెసింగ్ మెషీనరీ కోసం ఆర్డర్లు ఇచ్చామని, ఈ ప్రాజెక్టు యూపీలో వచ్చుంటే, రైతులకు లాభదాయకంగా ఉండేదని, భారీ ఎత్తున నిరుద్యోగులకు ఉపాధి లభించేదని చెప్పిన బాలకృష్ణ, ఈ నిర్ణయం రాందేవ్ స్వయంగా తీసుకున్నారని చెప్పారు.

ఇదిలావుండగా, పతంజలి ఆయుర్వేద తలపెట్టిన మెగా ఫుడ్ పార్క్ విషయమై కేంద్రం వాదన మరోలా ఉంది. ఈ ప్రాజెక్టుకు ఢిల్లీ సమీపంలోని నోయిడా పరిధిలో ఉన్న గౌతమ్ బుద్ధ నగర్ లో ఏర్పాటు చేసేందుకు గత జనవరిలో కేంద్రం ప్రాధమిక అనుమతులు మంజూరు చేసింది. అయితే, బ్యాంక్ లోన్ రుణాలు, భూ సేకరణ తదితరాల్లో కొన్ని నిబంధనలను సంస్థ పాటించాల్సి వుండగా, ఆ విషయంలో విఫలమైంది. గడువు ముగిసిన తరువాత కూడా తాము పతంజలి ఆయుర్వేదకు నెల రోజుల సమయం ఇచ్చామని, నిబంధనలను పాటించకుంటే, ప్రాజెక్టును రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదని ఫుడ్ ప్రాసెసింట్ డిపార్ట్ మెంట్ హెడ్ జేపీ మీనా వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News