Tirumala: నేను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ప్రాణత్యాగానికి సిద్ధం: టీటీడీ మాజీ జేఈవో బాలసుబ్రహ్మణ్యం

  • తొమ్మిదిన్నరేళ్లు టీటీడీ జేఈవోగా పని చేశా 
  • రూపాయి ఆశించకుండా స్వామి వారి సేవ చేశాను
  • రాజకీయ లబ్ది కోసం దేవుడి పేరును వినియోగించడం బాధాకరం

తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని టీటీడీ మాజీ జేఈవో బాలసుబ్రహ్మణ్యం అన్నారు. నెల్లూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తొమ్మిదిన్నరేళ్లు టీటీడీ జేఈవోగా పని చేశానని, పదిహేనేళ్ల పాటు దైవ సేవలో ఉన్నానని, రూపాయి ఆశించకుండా స్వామి వారి సేవ చేశానని అన్నారు. రాజకీయ, వ్యక్తిగత లబ్ది కోసం దేవుడి పేరును వినియోగించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

మిరాశీ వ్యవస్థ రాజ్యాంగానికి వ్యతిరేకమని, వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించవద్దని అప్పట్లో అధికారులకు తాను చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకే నాలుగు మాడ వీధుల్లోని నిర్మాణాలను తొలగించారని, బాధితులకు పరిహారం, శాశ్వత నివాస సదుపాయం కల్పించారని చెప్పారు. ఆరోపణలు చేస్తున్న వాళ్లు త్రీ బెడ్ రూమ్ ఇళ్లు తీసుకున్నారని చెప్పిన బాలసుబ్రహ్మణ్యం, తిరుమల శ్రీవారి నగలు, ఆభరణాలు మాయమయ్యాయన్నది అవాస్తవమని అన్నారు.

More Telugu News