kumaraswamy: తన కాలేజీ రోజుల విషయాలను విద్యార్థులతో పంచుకున్న కుమారస్వామి

  • బాధ్యత లేకుండా తిరిగేవాడిని.. పెద్ద మొద్దును
  • ప్రశ్నలు అడుగుతారేమోనని వెనుక కూర్చునేవాడిని
  • ఎందుకూ పనికిరావంటూ నాన్న తిడుతుండేవారు

బెంగళూరులోని జయానగర్ నేషనల్ డిగ్రీ కాలేజీలో నిన్న శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఇక్కడ విద్యనభ్యసించారు. ఈ వేడుకలకు ఆయన కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుమారస్వామిని కళాశాల యాజమాన్యం, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, తన విద్యార్థి జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కాలేజీ రోజుల్లో తాను బాధ్యత లేకుండా తిరిగేవాడినని, పెద్ద మొద్దునని కుమారస్వామి తెలిపారు. ముందు బెంచ్ లలో కూర్చుంటే టీచర్లు ఎక్కడ ప్రశ్నలు అడుగుతారో అని, వెనుక కూర్చునేవాడినని చెప్పారు. మీరు అలా చేయవద్దని, బాధ్యతగా మెలగాలని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. కాలేజీ రోజుల్లో తాను రాజ్ కుమార్ కు వీరాభిమానినని చెప్పారు. చదువును కొనసాగించి ఉంటే ఐఏఎస్ అధికారిని అయ్యుండేవాడినేమో అని అన్నారు. నువ్వెందుకూ పనికి రావు అని నాన్న దేవేగౌడ ఎప్పుడు తిడుతుండేవారని చెప్పారు. జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని... చివరకు రాజకీయాల్లోకి అడుగుపెట్టానని తెలిపారు.

ఎంపీగా గెలిచినప్పుడు మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడ్డానని కుమారస్వామి చెప్పారు. రాజకీయాల్లో తాను ఒక అదృష్టవంతుడినని అన్నారు. విద్యార్థులు ఎప్పుడైనా విధానసౌధకు వచ్చి తనను కలవొచ్చాని ఆహ్వానించారు. తనను కలవడానికి అపాయింట్ మెంట్ కూడా అవసరం లేదని... సీఎంను కలవాలని చెప్పి రండని అన్నారు. 

More Telugu News