Sara Sanders: కిమ్ తో భేటీపై తొలిసారి అధికారిక ప్రకటన చేసిన వైట్ హౌస్!

  • 12వ తేదీ ఉదయం 9 గంటలకు
  • అమెరికా నుంచి అదనపు బలగాలు
  • ముందు రోజే సమావేశ ప్రాంగణం అమెరికా అధీనంలోకి
  • వెల్లడించిన సారా శాండర్స్

ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ భేటీపై శ్వేతసౌధం తొలిసారిగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. వీరిద్దరి మధ్యా సింగపూర్ వేదికగా ఈ నెల 12న ఉదయం 9 గంటలకు సమావేశం ఉంటుందని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ తెలియజేశారు. ఈ సమావేశానికి అమెరికా నుంచి భద్రతా బలగాలు సింగపూర్ వెళతాయని, ముందురోజు రాత్రి 9 గంటల నుంచే సమావేశం ప్రాంతం తమ అధీనంలో ఉంటుందని వెల్లడించారు.

ట్రంప్, కిమ్ ల సమావేశంలో సానుకూల చర్చలు సాగుతాయని అంచనా వేసిన వైట్ హౌస్, ఇదే సమయంలో ఇరు దేశాల ప్రతినిధి బృందాలు కూడా సమావేశం అవుతాయని వెల్లడించింది. ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చడమే ప్రధాన అజెండాగా ట్రంప్ చర్చించనున్నారని శాండర్స్ తెలిపారు. కాగా, గత వారంలో నార్త్ కొరియా రాయబారి కిమ్ మోంగ్ చోల్ వైట్ హౌస్ కు వచ్చి ట్రంప్ తో సమావేశమై, కిమ్ పంపిన లేఖను అందించిన తరువాత, వీరిద్దరి చర్చలపై కొనసాగుతూ వచ్చిన ప్రతిష్ఠంభన తొలగిందన్న సంగతి తెలిసిందే.

More Telugu News