KCR: 'ఊరికో నలుగురు పుట్టి పీక్కు తినండి' అంటూ కేసీఆర్ చెప్పిన 'రామాయణం' పిట్టకథ!

  • రైతన్న మరణిస్తే 10 రోజుల్లోగా రూ. 5 లక్షలు
  • సరికొత్త జీవిత బీమా పథకం ప్రారంభం
  • ఎల్ఐసీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన 'రైతుబంధు' పథకం విజయవంతం కావడంతో ఎంతో ఆనందంగా ఉన్న కేసీఆర్, రైతు మరణించిన 10 రోజుల్లో రూ. 5 లక్షలు అందించేలా ఉచిత జీవిత బీమా పథకానికి రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం కోసం నేడు ప్రభుత్వ రంగ ఎల్ఐసీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదరగా, ఆ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్, మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని నిత్యమూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని చెబుతూ, రామాయణాన్ని పిట్టకథగా చెప్పి ఆహూతులను, సభికులను నవ్వించారు. విమర్శించే వాళ్లు మనుషులని మనం అనుకుంటామని, కానీ వారు మనుషులు కాదని అన్నారు.

"శ్రీరామచంద్రుల వారు లంక మీదికి యుద్ధానికి పోయిర్రు. ఏదీ... సీతమ్మను విడిపించక రావడానికి. యుద్ధం అయిపోయింది, ధర్మం గెలిచింది కాబట్టి, సీతమ్మవారిని తీసుకుని వస్తుర్రు. యుద్ధం జరిగేటప్పుడు... అప్పుడు ధర్మయుద్ధం. గంట మోగితే ప్రారంభం చేయాలె. గంట మోగితే మళ్లా బంద్ చేయాలె. రోజూ సాయంత్రం బంద్ చేసేవారు. సమీక్ష చేసుకునేది ఎట్లా ఉన్నరో ఏమైందని. ఒకరోజు రాములవారు తన సైన్యాధిపతులతో కూర్చుని మాట్లాడుతుంటే, వారు చెప్పిర్రు.

సార్... మనసైడ్ ధర్మమున్నది. ఎట్లజేసీ మనం గెలవాలె. రాక్షసులైతే పెద్దగున్నరు. మన సైన్యమేమో కోతులైపోయినై... ఎట్లన్నా జేసి గెలవాలి, ఆలోచించాలని అన్నారు. నా దగ్గరైతే రామబాణం ఉందయ్యా... అదేస్తే అందరూ చచ్చిపోతారు. కానీ అందరూ చచ్చిపోవడం కరెక్ట్ కాదు. అది సృష్టి నియమానికి విరుద్దం ఏంజేయాలంటే... ఇక నువ్వే దేవుడివి. నువ్వే ఎట్లాగైనా సంభాళించుకో. మొత్తం మీద మనం గెలిచినట్లు చెయ్యి అంటే, శ్రీరాముల వారు ఆ రామబాణం తీసి వేసిర్రు.

రావణాసురునితో సహా మొత్తం చచ్చిపోయిర్రు. సరే విజయం సాధించి తిరిగి వస్తుర్రు. కొద్ది దూరం వచ్చేవరకు మధ్యలో... ఎవళ్లైతే సగం ఆయుష్యుతో నిచ్చిపోయిర్రో... అర్ధాయుష్యుతో చచ్చిపోయిర్రో వాళ్లంతా ఎదురుతిరిగిర్రు. అయ్యా శ్రీరామచంద్రమూర్తి... నువ్వు రామబాణం వేస్తివి. మేమంతా గౌరవించి చచ్చిపోతిమి. మరి మా సగం ఆయుష్యు సంగతేంటి? అనగా... ఏం ఫర్లేదు. కలియుగంలో మీరు ఊరికో నలుగురు చొప్పున పుట్టి మందిని పీక్కోని తినుర్రి... గీ కొడుకులంతా గా బాపతుగాళ్లు" అని వ్యంగ్యోక్తులు విసిరారు. కేసీఆర్ పిట్టకథకు నవ్వులు విరిశాయి.

More Telugu News