షరపోవా నా గురించి చెప్పినవన్నీ అబద్ధాలే: సెరీనా విలియమ్స్

04-06-2018 Mon 10:02
  • ఆత్మకథలో సెరీనా గురించి పేర్కొన్న షరపోవా
  • తనపై సెరీనా ద్వేషం పెంచుకుందన్న రష్యన్ భామ
  • ఓడిపోతే ఎవరైనా కంటతడి పెడతారన్న సెరీనా
స్టార్ టెన్నిస్ ప్లేయర్లు షరపోవా, సెరీనా విలియమ్స్ ల మధ్య అగాధం మరింత పెద్దదైంది. షరపోవా ఆత్మకథ 'అన్ స్టాపబుల్'లో తన గురించి అబద్ధాలు చెప్పిందని సెరీనా మండిపడింది. 2004 వింబుల్డన్ ఫైనల్లో తన చేతిలో ఓటమిపాలైన అనంతరం సెరీనా ఏడ్చిందని, ఆ తర్వాత తనపై ద్వేషం పెంచుకుందని తన ఆత్మకథలో షరపోవా పేర్కొంది. దీనిపై సెరీనా స్పందిస్తూ, తాను మ్యాచ్ లు ఓడిపోయినప్పుడు లాకర్ గదిలో చాలా సార్లు ఏడ్చానని చెప్పింది. ఓడిపోయిన ఎంతో మంది ఆటగాళ్లు కంటతడి పెట్టడం సహజమని తెలిపింది. వింబుల్డన్ లాంటి టోర్నీ ఫైనల్లో ఓడిపోతే ఎవరైనా కచ్చితంగా షాక్ కు గురవుతారని చెప్పింది. ఆటగాళ్ల ఆవేదనను తప్పుబట్టాల్సిన అవసరం లేదని... షరపోవా తన ఆత్మకథలో అబద్ధాలను చెప్పిందని విమర్శించింది.