Youtube: యూట్యూబ్‌లో చూసి తుపాకీ తయారీ.. పోలీసుల అదుపులో యువకుడు

  • తుపాకీ తయారు చేసిన ఎలక్ట్రీషియన్
  • తుపాకీ పేల్చడంతో జనం పరుగులు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

యూట్యూబ్‌లో చూసి తుపాకీ తయారు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం విజయనగరం జిల్లా కోడూరుకు చెందిన మరదన రమేశ్ (26) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని ఓ స్టీల్ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మొబైల్‌లో యూట్యూబ్ చూసే అలవాటున్న రమేశ్ ఓ తుపాకీ, మూడు బుల్లెట్లను తయారుచేశాడు.

తయారు చేసిన తుపాకీ పనిచేస్తుందో, లేదో పరీక్షించేందుకు తూప్రాన్ గ్రామ పంచాయతీ కార్యాలయం వెనక ఉన్న కల్లు దుకాణానికి వెళ్లి తుపాకీ పేల్చాడు. దీంతో అక్కడున్న జనం పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు కల్లు దుకాణానికి చేరుకుని రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి తుపాకీ, మూడు తూటాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News