farmers: కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు.. తమ ఆందోళనను కించపరుస్తోన్న నేతలపై రైతుల ఆగ్రహం

  • కేవలం కొందరే నిరసన వ్యక్తం చేస్తున్నారన్న కేంద్రమంత్రి
  • రైతులకు ఎటువంటి సమస్యలు లేవన్న హర్యానా సీఎం
  • నేతలు ఇచ్చిన హామీలనే అమలు చేయాలంటోన్న రైతులు
  • మద్దతు ధర ఇవ్వాలంటోన్న అన్నదాతలు

తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ రైతులు చేస్తోన్న ఆందోళనలపై కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాధామోహన్ సింగ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌ ఖట్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో కోట్లాది మంది రైతులు ఉన్నారని, కానీ, కేవలం కొందరే నిరసన వ్యక్తం చేస్తున్నారని, వారి ఆందోళనలను చులకన చేసేలా రాధా మోహన్‌ సింగ్‌ వ్యాఖ్యానించగా.. అసలు రైతులకు ఎటువంటి సమస్యలు లేవని, అనవసర విషయాలపై దృష్టి పెడుతున్నారని ఖట్టర్‌ అన్నారు.

వారి వ్యాఖ్యలపై రైతులు, రైతు సంఘాల నాయకులు స్పందిస్తూ.. తమ సమస్యలను చెప్పుకుంటూ ఆవేదన చెందుతోంటే మరోవైపు తమను కొందరు చులకన చేసి మాట్లాడుతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, రాష్ట్రీయ కిసాన్‌ మజ్దూర్‌ మహాసంఘ్‌ కన్వీనర్‌ శివకుమార్‌ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. తమకు అన్యాయం చేస్తోన్న నేతలు దీనికి కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు.

ఎన్నికల ముందు నేతలు ఇచ్చిన హామీలనే అమలు చేయమని కోరుతున్నామని, తమ పంటలకు మద్దతు ధర ఇవ్వాలని అంటున్నామని ఆయన అన్నారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన నేతలు.. ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదని చెప్పారు.

More Telugu News