Nipha: తిరుపతిలో 'నిపా'పై ప్రజలకు నిజం చెప్పండి: కలెక్టర్ ను ఆదేశించిన చంద్రబాబు

  • కేరళ నుంచి వచ్చిన వైద్యురాలు
  • నిపా సోకినట్టు అనుమానం
  • ఆరా తీసిన చంద్రబాబునాయుడు
  • ప్రజలకు అవగాహన కలిగించాలని ఆదేశం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నిపా వైరస్ వ్యాపిస్తోందని ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. కొద్దిసేపటి క్రితం చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నతో మాట్లాడిన ఆయన, నిపా వైరస్ పై ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని ఆదేశించారు.

నిపా వైరస్ వ్యాపించడం కేవలం వదంతులేనని, కేరళ నుంచి వచ్చిన వైద్యురాలి రక్తంలో వైరస్ ఉన్నట్టు ఇంతవరకూ తేలలేదని కలెక్టర్ సీఎంకు నివేదించారు. అయినా ముందు జాగ్రత్తగా, ఆమెను ప్రత్యేక గదిలో ఉంచి చికిత్సను అందిస్తున్నామని, ఆమెకు నిపా సోకి ఉండవచ్చని కేరళ వైద్యుల నుంచి సమాచారం రావడంతో అలర్ట్ అయ్యామని తెలిపారు.

ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. తాను స్వయంగా వెళ్లి ఆ వైద్యురాలిని పరామర్శించి వచ్చినట్టు కలెక్టర్ చంద్రబాబుకు వివరించారు. ఆమె జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని, రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపామని అన్నారు. ఆమెకు నిపా సోకలేదనే వైద్యులు భావిస్తున్నట్టు చెప్పారు. కేరళ సర్కారు సూచన మేరకు ఆమెను ఐదు రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచనున్నామని చంద్రబాబుకు కలెక్టర్ వివరించారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకూ నిపా కేసు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రద్యుమ్న అన్నారు.

More Telugu News