Rajinikanth: క్షమాపణ చెబుతారా? కేసు వేయమంటారా?.. 'కాలా' రజనీకాంత్‌కు జర్నలిస్ట్ నోటీసులు

  • రజనీకాంత్ టీమ్‌కు నోటీసులు పంపిన జవహర్
  •  లిఖితపూర్వక క్షమాపణకు డిమాండ్
  • లేదంటే రూ.101 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ముంబైకి చెందిన జర్నలిస్ట్ జవహర్ హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం విడుదల కాబోతున్న రజనీ సినిమా ‘కాలా’లో తన తండ్రి దివంగత ఎస్.థిరవియమ్ నాడార్ పాత్రలో రజనీ నటించారని ఆయన పేర్కొన్నారు. మురికివాడల్లో నివసించే తమిళుల కోసం పోరాడే వ్యక్తిగా రజనీ ఈ సినిమాలో నటించినట్టు తెలుస్తోందని, ఇది తన తండ్రి కథేనని, ఈ విషయాన్ని చిత్ర యూనిట్ దాచిపెట్టిందని జవహర్ ఆరోపిస్తూ నోటీసులు పంపారు.

నోటీసులు అందిన 36 గంటల్లోగా తనకు లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.101 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ.. తన తండ్రి బెల్లం వ్యాపారని, 1957లో టుటికోరిన్ జిల్లా నుంచి ముంబైలోని ధరావికి వలస వచ్చారని పేర్కొన్నారు. అతనిని ‘గుడ్‌వాలా సేఠ్’, ‘కాలా సేఠ్’ అని పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి ఎప్పుడూ తప్పుడు పనులకు పాల్పడలేదన్నారు.

మరోవైపు, జవహర్ ఆరోపణలను రజనీకాంత్ టీమ్‌ కొట్టిపడేసింది. ‘కాలా’ కథకు, థిరవియమ్ నాడార్‌కు అస్సలు సంబంధం లేదని తేల్చి చెప్పింది. నోటీసులు అందాక స్పందిస్తామని పేర్కొంది. 

More Telugu News