avanthi srinivas: వైసీపీతో మంతనాలు జరుపుతున్న టీడీపీ ఎంపీ అవంతి

  • భీమిలి నుంచి గంటాపై పోటీకి సిద్ధపడుతున్న అవంతి
  • ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రివర్గంలో చోటు సంపాదించడమే లక్ష్యం
  • అవంతిని అడ్డుకునేందుకు యత్నిస్తున్న భీమిలి వైసీపీ నేతలు

ఏపీ రాజకీయాల్లో మరో వార్త సంచలనం రేపుతోంది. టీడీపీ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీ మారబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ కీలక నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ సారి ఎంపీగా కాకుండా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది ఆయన అభీష్టంగా తెలుస్తోంది. అంతేకాదు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలనే భావనలో ఆయన ఉన్నారట. ఎమ్మెల్యే కావడం, రాష్ట్ర మంత్రివర్గంలో చేరడమే తన లక్ష్యమని తన సన్నిహితులతో ఆయన చెప్పినట్టు సమాచారం. 2009 ఎన్నికల్లో భీమిలి నుంచి ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా అవంతి గెలిచారు. అనంతరం 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి, అనకాపల్లి నుంచి ఎంపీగా గెలుపొందారు.

ఇదిలా ఉంచితే, భీమిలి వైసీపీ నేత జి.వెంకటరెడ్డి ఆ నియోజకవర్గ పార్టీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టిన మెసేజ్ ఇప్పుడు సంచలనంగా మారింది. అవంతిని వైసీపీలోకి రాకుండా అడ్డుకోవాలన్నదే ఆ మెసేజ్ సారాంశం. టీడీపీ ఎంపీ వైసీపీలోకి చేరబోతున్న నేపథ్యంలోనే, వెంకటరెడ్డి ఈ మెసేజ్ పెట్టారు. దీంతో, వైసీపీలోకి అవంతి వెళ్లనున్నారనే వార్తలకు బలం చేకూరింది. అయితే, ఈ వార్తలపై స్పందించేందుకు అవంతి అందుబాటులో లేరు. 

More Telugu News