Pawan Kalyan: మీ 40 ఏళ్ల అనుభవం ఇసుక మాఫియాను పెంచి పోషించడానికే ఉపయోగపడింది!: చంద్రబాబుపై పవన్‌ కల్యాణ్‌ విమర్శలు

  • దోచుకోవడంలో టీడీపీ వైసీపీని మించిపోయింది 
  • నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలంటే, లోకేశ్ కి మంత్రి పదవి ఇచ్చారు 
  • కార్మికుల సమస్యలు పట్టని సర్కార్ ఇది

గత ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకున్నానని, అయితే, ఓట్లు చీలిపోతే రాష్ట్రానికి అన్యాయం జరిగి, వైసీపీకి కలిసి వస్తుందని, వాళ్లు వస్తే భూ కబ్జాలు, అవినీతి పెరిగిపోతాయని భయపడ్డానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అందుకే, తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చానని, తీరా ఆ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని దోచేయడంలో వైసీపీ వాళ్లని మించిపోయారని ఆరోపించారు.

గత ఎన్నికల ముందు టీడీపీ వాళ్లు తన దగ్గరకి వచ్చి అడిగితేనే బీజేపీ, టీడీపీకి మద్దతు ఇచ్చానని పవన్ అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో వెనకబాటుతనం పోయి అభివృద్ధి చేస్తారని భావిస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక మాఫియా, భూ కబ్జాల్లో మునిగిపోయిందని అన్నారు. జనసేన పోరాట యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ ఈరోజు విజయనగరంలోని చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో కవాతు నిర్వహించారు.

అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తూ "తప్పు చేస్తే తప్పకుండా నిలదీసే పార్టీ జనసేన. ఉత్తరాంధ్రలో ఉపాధిలేక వలసలు పోతుంటే సర్కారుకి పట్టదు. ఈ ప్రాంత ప్రజలకి సరైన వైద్యం, మంచి విద్య అందించలేరు. తోటపల్లి ప్రాజెక్టుకి చివరన ఉన్న చీపురుపల్లి భూములకి ఇప్పటికీ నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. కాలువలు కూడా పూర్తి చేయలేదు. వరద నీళ్లు ఇచ్చి ఇవే తోటపల్లి ప్రాజెక్టు నీళ్లు అంటున్నారు. ఇక్కడి ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు లేరు.

బయటి నుంచి డాక్టర్లను పిలిచి, రోగితో డబ్బులు కట్టిస్తున్నారు. ఇదేమి పద్ధతి? వలసలు వెళ్లిపోతున్నారు అని నాయకులకి చెబితే... ఇక్కడే ఉండి మట్టి పిసుక్కొంటే ఏమి వస్తుందని చులకన చేస్తారా? ఈ మట్టి పౌరుషం మీకు తెలుసా? సమైక్యాంధ్ర ఉద్యమంలో విజయనగరం జిల్లా ప్రజలు పోరాడితే 14 రోజులు కర్ఫ్యూ పెట్టారు. అదీ వారి తెగువ. చీపురుపల్లి ప్రాంత యువతకి మంచి విద్య కూడా ఇవ్వడం లేదు.

వృత్తి నైపుణ్యాలు పెంచి, ఉపాధి ఇచ్చే పాలిటెక్నిక్ కాలేజీ ఇక్కడ అవసరం ఉంది. ఇక్కడే ఉద్యోగాలు, ఉపాధి ఇచ్చే పరిశ్రమలు కావాలి. కానీ ప్రభుత్వం మాత్రం కాలుష్యం వెదజల్లే వాటినే ఉత్తరాంధ్రకి ఇస్తోంది. నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలంటే.. ముఖ్యమంత్రి వాళ్ల అబ్బాయి లోకేశ్ కి ఉద్యోగం ఇచ్చారు.. మంత్రి పదవి కట్టబెట్టి... మీ అబ్బాయికి ఉద్యోగం ఇస్తే అందరికీ ఇచ్చినట్లు కాదు. గరివిడి మండలంలో మాంగనీస్ గనుల్ని అక్రమంగా తవ్వేస్తుంటే అవినీతి ఎక్కడ ఉంది? అని ముఖ్యమంత్రి అడుగుతున్నారు. ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి.

ప్రభుత్వ ఖజానాకి నష్టం... టీడీపీ నాయకులకి లాభం కలుగుతోంది. ఇక్కడి ఫెర్రో ఎల్లాయిస్ కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం ఈ పాలకులకి పట్టదు. ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ పారిశ్రామికవేత్తల క్షేమమే కావాలిగానీ కార్మికుల సంక్షేమం అవసరం లేదు. ఇక్కడి కార్మికులకి జీవిత బీమా అవసరం. వారి కుటుంబాలకి ఓ భరోసా కావాలి. వీటన్నింటినీ జనసేన గుర్తించింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని ముఖ్యమంత్రి చెపుతుంటారు... వారి అనుభవం ఇసుక మాఫియాను పెంచి పోషించడానికే ఉపయోగపడింది.

ఉచిత ఇసుక పేరుతో అవినీతికి ఓ చట్టబద్ధత ఇచ్చింది ఆ అనుభవం. పొలాల్లో ఇసుక మేటలు వేసిందనే పేరుతో మీ నాయకులే మొత్తం దోచేస్తున్నారు. జనసేన పార్టీ ప్రజల ఆకాంక్షలు, యువత ఆలోచనలు తెలుసుకున్న పార్టీ. ప్రతి సమస్యనీ అర్థం చేసుకొనే పార్టీ. ఈ సమస్యలకి పరిష్కారం దొరికే వరకూ పోరాడుతుంది" అని అన్నారు.

More Telugu News