Telangana: ఇదే నా చివరి ఐటీ నివేదిక...: కేటీఆర్ 'చమత్కారం'

  • ఐటీ రంగంలో దూసుకెళుతున్న తెలంగాణ
  • ఎన్నికల ముందు సంవత్సరంలో ఐటీ రిపోర్ట్ విడుదల
  • రెండేళ్లలో 3 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న తెలంగాణలో, 2017–18 ఆర్థిక సంవత్సరంలో 9.32 శాతం వృద్ధి రేటు నమోదైందని, రూ. 93,442 కోట్ల విలువైన ఐటీ, ఐటీఈఎస్ ఎగుమతిని సాధించామని ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు. వచ్చే రెండేళ్లలో బీటెక్, ఎంసీఏ తదితర విద్యలను అభ్యసించిన 3 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు లభించనున్నాయని అన్నారు.

 ఐటీ విభాగంలో ఇప్పటికే జాతీయ సగటు వృద్ధి రేటును తెలంగాణ అధిగమించిందని గుర్తు చేసిన ఆయన, 2020 నాటికి 16 శాతం అభివృద్ధి రేటును, రూ. 1.2 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులను సాధించి 4 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఈ 4 లక్షల ఉద్యోగాల ఫలితంగా మరో 20 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని కేటీఆర్ చెప్పారు.

గడచిన ఆర్థిక సంవత్సరంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ అభివృద్ధిపై తయారైన నివేదికను ఆవిష్కరించిన కేటీఆర్, గత సంవత్సరంతో పోలిస్తే, రాష్ట్రం ఐటీ ఎగుమతుల్లో 15.6 శాతం అభివృద్ధిని సాధించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత నాలుగేళ్లలో కొత్తగా 1.5 లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 4,75,308కు చేరిందని అన్నారు. ఐటీ విభాగం పనితీరుపై ఇదే తన చివరి నివేదికని చమత్కరించిన కేటీఆర్, వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల తరువాత, కొత్త వార్షిక నివేదికతో కొత్త ప్రభుత్వం ముందుకు వస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News