JDU: మీతో కలిసున్నందునే మా ఓటమి: బీజేపీపై జేడీయూ నిప్పులు!

  • ఉప ఎన్నికల్లో జేడీయూకు వ్యతిరేక ఫలితాలు
  • గెలిచిన ఆర్జేడీ అభ్యర్థి
  • తప్పును బీజేపీపై నెట్టిన కేసీ త్యాగి

బీజేపీతో కలిసున్నందునే ఉప ఎన్నికల్లో జేడీయూకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగి మండిపడ్డారు. నిన్న వెల్లడైన జోకిహాత్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాల్లో ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ ఖాన్ 40 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో, తాము ఓడిపోవడానికి కారణాన్ని బీజేపీపై నెట్టేశారు కేసీ త్యాగి. రోజూ పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతున్నాయని వ్యాఖ్యానించిన ఆయన, ప్రజాగ్రహం ఓట్ల రూపంలో కొంప ముంచిందని, తక్షణం పెట్రోలు ధరలను తగ్గించే ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 కాగా, బీహార్ లో తొలుత ఆర్జేడీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ, ఆపై ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో జతకట్టిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో బీజేపీ విఫలమవుతుంటే, సీఎం నితీశ్ కుమార్ సైతం తన అసంతృప్తి గళాన్ని బయటపెడుతున్న పరిస్థితి నెలకొంది.

More Telugu News