website: పెళ్లీడు కొచ్చారా?.. మీకు ఎంత కట్నం వస్తుందో తెలుసుకోండి అంటోన్న వెబ్‌సైట్‌!

  • dowrycalculator.com వెబ్‌సైట్‌పై కాంగ్రెస్‌ నేత ఫిర్యాదు
  • కట్నాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వ్యవహరిస్తోన్న వెబ్‌సైట్‌
  • వయసు, కులం, ఉద్యోగ విషయాలు అడుగుతోన్న వైనం

మార్కెట్లో ఏ వస్తువు రేటు ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఇంటర్నెట్‌ని ఆశ్రయిస్తాం. ఎన్నో కొత్త వెబ్‌సైట్లు పుట్టుకొచ్చి ఇంట్లో నుంచే అన్ని విషయాలను తెలుసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అలాగే, డౌరీ క్యాలుక్లేటర్ డాట్‌ కామ్‌ (dowrycalculator.com) అంటూ ఓ వెబ్‌సైట్‌ ఉంది. పెళ్లికి కట్నం తీసుకోవడం అనేది ఓ దురాచారమే కాక చట్టరీత్యా నేరమన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే వారు చాలా అరుదు.

ఈ విషయాన్నే క్యాష్‌ చేసుకుంటూ ఈ వెబ్‌సైట్‌... మీరు పెళ్లీడుకి వచ్చారా?  మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందామనుకుంటున్నారా? మీకు వచ్చే కట్నం ఎంతో తెలుసా? అంటూ అబ్బాయి వయసు, కులం, ఉద్యోగం వంటి విషయాలు అడిగి అతడు పెళ్లి చేసుకుంటే వచ్చే కట్నం ఎంతో చెప్పేస్తోంది. ఆ తరువాత అధికంగా కట్నం లాగడానికి పలు సలహాలు కూడా ఇస్తోంది.  దీనిపై కొందరు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్‌ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్విట్టర్‌ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కొంత మంది తన దృష్టికి తీసుకువచ్చారని, కట్నం తీసుకోవడం మన దేశంలో అనైతికం అని సైట్‌ నిర్వాహకులకు తెలియజేయాలనుకుంటున్నానని అన్నారు. దీనిపై వెంటనే చర్య తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ప్రధానికి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. కట్నాన్ని ప్రోత్సహించేలా ఉన్న ఈ వెబ్‌సైట్‌పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News