gvl narasimha rao: ఇష్టం వచ్చినట్టు యూటర్న్ లు, ట్విస్ట్ లు తీసుకోవడానికి ఇది సినిమా కాదు: చంద్రబాబుపై జీవీఎల్ మండిపాటు

  • కేంద్ర నిధులు అవినీతిపాలవుతున్నాయని కేంద్ర పరిశీలనలో తేలింది
  • ఏపీకి నిధులు ఇస్తే.. టీడీపీకి ఎన్నికల నిధులు ఇచ్చినట్టే
  • చంద్రబాబు ప్రవర్తన ఊసరవెల్లికి కూడా సిగ్గు తెప్పించేలా ఉంది

మేము తినము, మిమ్మల్ని తిననీయము అంటూ దేశానికి ప్రధాని మోదీ మాట ఇచ్చారని... అలాంటప్పుడు ఏపీలో జరుగుతున్న అవినీతికి బీజేపీ ఎలా సహకరిస్తుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఇచ్చిన నిధులు అవినీతిపాలవుతున్నాయంటూ కేంద్ర పరిశీలనలో తేలిందని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణంలో దోపిడీ జరిగిందనే విషయాన్ని కాగ్ పేర్కొందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి నిధులు ఇస్తే... టీడీపీకి ఎన్నికల నిధులు ఇచ్చినట్టు అవుతుందని అన్నారు.

విశాఖపట్నం-చెన్నై కారిడార్ లో విశాఖ, విజయవాడల్లో పారిశ్రామికవాడల నిర్మాణానికి కేంద్రం అనుమతించిందని చెప్పారు. వీటివల్ల భారీ ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. సొంత డబ్బా కొట్టుకోవడానికే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారని విమర్శించారు. ఊరవెల్లికి కూడా సిగ్గు తెప్పించేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు... యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా ఉద్యమ సమితి నేతగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు యూటర్న్ లు, ట్విస్ట్ లు తీసుకోవడానికి ఇది సినిమా కాదని అన్నారు. 

More Telugu News