ఐఏఎస్ అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బొత్స

30-05-2018 Wed 15:32
  • జగన్ ను విమర్శించడం తప్ప మహానాడులో చేసిందేమీ లేదు
  • జేసీ దివాకర్ రెడ్డిని గెలిపించింది రాజశేఖరరెడ్డే
  • ఏపీలో పంచ భూతాలను కూడా పంచుకు తింటున్నారు

తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో జగన్ ను విమర్శించడం తప్ప చేసిందేమీ లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఓవైపు తినడానికి తిండి లేక జనాలు అల్లాడుతుంటే... మహానాడులో నేతి మిఠాయిలు, బందరు లడ్డూలను ఆస్వాదించారని విమర్శించారు. మహానాడులో జగన్ పై జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు.

గతంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేనటువంటి నాయకత్వం జేసీదని ఎద్దేవా చేశారు. అలాంటి పరిస్థితుల్లో రాజశేఖరరెడ్డి తాడిపత్రికి వెళ్లి జేసీని గెలిపించారని అన్నారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, పంచ భూతాలను సైతం పంచుకు తింటున్నారని దుయ్యబట్టారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఐఏఎస్ అధికారులు అధికార పార్టీ నేతల చెప్పులు మోస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.