YSRCP: వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించినా ఉప ఎన్నికలు రావు... కారణం ఏమిటంటే..!

  • 2019 జూన్ 4తో ముగియనున్న ఎన్డీఏ పదవీకాలం
  • ఉప ఎన్నికలో గెలిచే సభ్యుడి పదవీకాలం ఏడాది ఉండాల్సిందే
  • ఎన్నికల తరువాత ఏడాది సమయం ఉండే అవకాశం లేదు
  • ఏ విధంగా చూసినా ఉప ఎన్నికలు ఉండవంటున్న విశ్లేషకులు

ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, తమ పదవులకు రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీల భవిష్యత్తుపై జూన్ 5 నుంచి 7వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించిన నేపథ్యంలో, వీరి రాజీనామాలు ఆమోదించినా, ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితులు ఎంతమాత్రమూ కనిపించడం లేదు. 2014 పార్లమెంట్ ఎన్నికల తరువాత జూన్ 4వ తేదీన లోక్ సభ సమావేశం జరుగగా, వచ్చే సంవత్సరం జూన్ 3తో మోదీ సర్కారుకు ఐదేళ్ల పదవీ కాలం పూర్తవుతుంది.

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం, ఓ ఉప ఎన్నిక జరిగితే, అందులో గెలిచే సభ్యుడి పదవీకాలం కనీసం ఏడాది పాటు ఉండాలి. జూన్ 5నే ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నా, ఎన్నికలు జరగాలంటే ఆపై మరో నెల రోజుల సమయమైనా పడుతుంది. అప్పుడు గెలిచే సభ్యుడి పదవీకాలం ఏడాది ఉండదు. ఇక నెలన్నర క్రితమే వీరి రాజీనామాలు ఆమోదం పొందినా, ఉప ఎన్నికలు వచ్చేవి కావని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రత్యేక కారణాలవల్ల ఖాళీ అయ్యే చోట్ల ఎన్నికలు జరిపించేందుకు ఈసీ 90 రోజుల వరకూ సమయం తీసుకుంటుంది.దీంతో ఇక సమయం సరిపోదు. 

More Telugu News