USA: అమెరికా వెళ్లాలనుకునే వారికి శుభవార్త... 15 వేల అదనపు హెచ్-2బీ వీసాలు సిద్ధం!

  • ఇప్పటికే 66 వేల హెచ్-2 బీ వీసాల జారీ
  • వీసాల కోటాను పెంచిన అమెరికా
  • వివరాలు వెల్లడించిన హోమ్ ల్యాండ్ సెక్యూరిటీస్

ఇటీవలి కాలంలో వీసాల జారీ నిబంధనలను కఠినతరం చేస్తూ, అమెరికాకు వెళ్లాలని డాలర్ డ్రీమ్స్ కంటున్న యువతకు నిద్ర లేకుండా చేస్తున్న అమెరికా ప్రభుత్వం ఓ శుభవార్తను చెప్పింది. అదనంగా 15 వేల హెచ్‌-2బీ వీసాలను జారీ చేయనున్నట్టు వెల్లడించింది. 2018 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే జారీ చేసిన 66 వేల వీసాలకు ఇవి అదనమని, డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీస్ తెలియజేసింది. కాగా, అమెరికాలో హెచ్-2బీ వీసాలను వ్యవసాయేతర కార్మికులకు ప్రస్తుతం జారీ చేస్తున్నారు.

ఈ వీసాలను పెంచడం ద్వారా, వ్యవసాయేతర రంగాల ఉద్యోగాలను పూరించుకోవడమే అమెరికా ఉద్దేశమని నిపుణులు వ్యాఖ్యానించారు. వ్యవసాయేతర కార్మికులుగా పనిచేసేందుకు ప్రతిభావంతులైన వర్కర్లు లేరని అభిప్రాయపడ్డ తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ కార్యదర్శి నీల్సన్ తెలిపారు. కాంగ్రెస్‌ సభ్యులు, వ్యాపార సంఘాలతో సమావేశమై చర్చించిన తరువాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆమె మీడియాకు తెలియజేశారు. ఈ సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 33 వేలు, మిగతా ఆరునెలల కాలంలో మరో 33 వేల వీసాలను జారీ చేయనుండగా, ఈ 15 వేలు వాటికి అదనం.

More Telugu News