Hyderabad: తల్లికి మందుల కోసం వెళుతుంటే... సాయం చేస్తానని చెప్పి అత్యాచారం... సినీ ఫక్కీలో ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు!

  • హైదరాబాద్ బాచుపల్లిలో ఘటన
  • యువతి కేకలు వేయడంతో అప్రమత్తమైన పెట్రోలింగ్ పోలీసులు
  • ఆటోను చేజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన వైనం

అనారోగ్యంతో ఉన్న తన తల్లికి అవసరమైన అత్యవసర మందుల కోసం అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చిన యువతిపై, సాయపడతానని చెప్పిన ఓ ఆటో డ్రైవర్ దాడికి దిగి అత్యాచారం చేయగా, ఆపై సినీ ఫక్కీలో పోలీసులు కిలోమీటర్ దూరం చేజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ కు చెందిన ఓ యువతి (20), తన తల్లికి కావాల్సిన మందుల కోసం సోమవారం రాత్రి రోడ్డుపైకి వచ్చి నిలబడింది.

ఆ సమయంలో ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఎస్ పరశురామ్, ఆమె వద్దకు వెళ్లగా, విషయం చెప్పింది. మెడికల్ షాపు వద్దకు తీసుకెళ్లాలని ఆమె కోరడంతో, సరేనని చెబుతూ, ఆటో ఎక్కించుకున్న అతను, ఓ హోటల్ వెనక్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ కామాంధుడిని ప్రతిఘటించలేక మిన్నకుండిపోయిన బాధితురాలు, దాహంతో మంచినీళ్ల కోసం ప్రాధేయపడటంతో, అదే ఆటోలో ఓ టీ స్టాల్ వద్దకు తీసుకువచ్చాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న పెట్రోలింగ్ వ్యాన్ ను చూసి యువతి కేకలు వేయడంతో ఆమెను వదిలి ఆటోలో పారిపోయాడు. ఏదో జరిగిందని తెలుసుకున్న పోలీసులు, తమ వాహనంలో ఆటోను ఛేజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

More Telugu News